చౌహాన్ ప్రమాణానికి బీజేపీ అగ్రనేతలు | Sakshi
Sakshi News home page

చౌహాన్ ప్రమాణానికి బీజేపీ అగ్రనేతలు

Published Sun, Dec 15 2013 2:44 AM

చౌహాన్ ప్రమాణానికి బీజేపీ అగ్రనేతలు - Sakshi

రూపాయి బియ్యం పథకం ఫైల్‌పై తొలి సంతకం
ప్రమాణస్వీకారానికి మోడీ, అద్వానీ,
చంద్రబాబు తదితరుల హాజరు


ముచ్చటగా మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్  ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడి జంబోరీ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ప్రమాణం చేయించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం తరలి వచ్చింది. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో పాటు పార్టీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత ఎల్‌కే అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతపక్ష నేత అరుణ్ జైట్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గోవా, పంజాబ్ ముఖ్యమంల్రు రమణ్‌సింగ్, వసుంధర రాజె, మనోహర్ పారికర్, ప్రకాశ్‌సింగ్ బాదల్ హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, మురళీ మనోహర్ జోషి, నితిన్ గడ్కరీ, నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధు, స్మృతి ఇరానీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, శిరోమణి అకాలీదళ్ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

ఇక ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 230 అసెంబ్లీ స్థానాలకు గానూ 165 కైవసం చేసుకుని కాంగ్రెస్‌ను 58కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. శివరాజ్ సింగ్ రెండు స్థానాలు బుధ్ని, విదిశల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. మూడో ఇన్నింగ్స్ ప్రారంభించిన శివరాజ్ సింగ్.. మేనిఫెస్టోలో ప్రకటించిన పేదలకు రూపాయి కిలో బియ్యం పంపిణీ పథకం ఫైలుపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఎన్నికల వాగ్దానాలకు కార్యరూపమిచ్చేందుకు మరో మూడు పథకాల ఫైళ్లపై అందరి సమక్షంలో సంతకం చేశారు. ‘ఎన్నికల ముందు నేను ఇచ్చిన హామీలను మీ అందరి సమక్షంలో నెరవేరుస్తున్నాను. మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందనడానికి ఇది అద్దంపడుతుంది’ అని ప్రమాణ స్వీకార సభలో చెప్పారు. బాలికల సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ త్వరలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామన్నారు.
 
 పొత్తుపై బీజేపీతో బాబు మంతనాలు?

శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో కలివిడిగా తిరుగుతూ కనిపించారు. బీజేపీతో భవిష్యత్ పొత్తుపై ఆయన ఆ పార్టీ నేతలను విడివిడిగా కలిసి మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఏపీలో విభజన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో స్పష్టమైన వైఖరి చెప్పకుండా దాటేస్తున్న చంద్రబాబు మధ్యప్రదేశ్‌కు వెళ్లి భవిష్యత్ పొత్తుపై బీజేపీ నేతలతో చర్చలు జరపడంపై టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 మిజో సీఎంగా తన్హావ్లా ప్రమాణం

 ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన లాల్‌తన్హావ్లా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. తన్హావ్లా ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించడం ఇది ఐదోసారి. ఆయనతోపాటు, మరో 11 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. వీరిలో ఏడుగురికి కేబినెట్ హోదా లభించింది. ఇక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ వక్కోమ్ పురుషోత్తం వీరితో శనివారం ప్రమాణం చేయించారు. 40 స్థానాల మిజోరాం అసెంబ్లీలో కాంగ్రెస్ 34 స్థానాలను కైవసం చేసుకుంది.
 

Advertisement
Advertisement