ప్రయాణికులపై అదనపు భారం | Sakshi
Sakshi News home page

ప్రయాణికులపై అదనపు భారం

Published Wed, Nov 19 2014 10:16 PM

ప్రయాణికులపై అదనపు భారం

 సాక్షి, ముంబై: ముంబైకర్లపై మరోసారి చార్జీల భారం మోపేందుకు బృహన్  ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ సన్నద్ధమవుతోంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆర్థిక సాయం అందజేయని పక్షంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటోంది. అయితే బీఎంసీ కనుక ఆర్థిక సాయం అందజేస్తే కనీస చార్జీ రూపాయి లేదా రెండు రూపాయలమేర పెంచాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం కనీస చార్జీలు ఆరు రూపాయలుగా ఉంది.

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర పెరుగుదల కూడా బెస్ట్ సంస్థకు శాపంగా పరిణమించింది. నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను గట్టెక్కించాలంటే చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు సంస్థ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనికి తోడు నవంబరు ఒకటో తేదీ నుంచి సీఎన్‌జీ ధర కేజీకీ రూ.4.50 చొప్పున పెరగడం ...మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.

 సీఎన్జీ ధర పెరుగుదల కారణంగా ఈ సంస్థకు సంవత్సరానికి దాదాపు రూ.30.24 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు అంచనావేశారు. కాలుష్యానికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో సంస్థ పరిపాలనా విభాగం డీజిల్ కంటే సీఎన్జీ బస్సుల కొనుగోలుకు ప్రాధాన్యమిచ్చింది. ఈ సంస్థ అధీనంలో మొత్తం 4,100 బస్సులున్నాయి. ఇందులో 2,970 బస్సులు సీఎన్జీతోనూ, మిగతావి డీజిల్‌తోనూ నడుస్తున్నాయి.

సీఎన్జీ సరఫరాచేసే మహానగర్ గ్యాస్ కంపెనీ బెస్ట్‌కు ప్రతి కిలోకూ 70 పైసల మేర రాయితీ ఇస్తోంది. వాస్తవానికి సీఎన్‌జీ గ్యాస్ కిలో ధర రూ.38.95 ఉండగా నవంబర్ ఒకటో తేదీ నుంచి అది రూ.43.40 కి చేరుకుంది. మహానగర్ గ్యాస్ కంపెనీ 70 పైసలు రాయితీ ఇవ్వడంతో ప్రస్తుతం రూ.42.70 చొప్పున చెల్లిస్తోంది. అయినప్పటికి ధర పెరుగుదల భారం ఈ సంస్థపై పడుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులు మరోసారి చార్జీల పెరుగుదల భారాన్ని మోయక తప్పేలా కనిపించడం లేదు.

Advertisement
Advertisement