బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా ప్రీతి పటేల్ | Sakshi
Sakshi News home page

బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా ప్రీతి పటేల్

Published Thu, Jul 17 2014 2:54 AM

బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా  ప్రీతి పటేల్

లండన్: బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ నియమితులయ్యారు. బుధవారంనాటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ప్రీతి పటేల్‌ను ట్రెజరీ మంత్రిగా నియమించారు. 42 ఏళ్ల ప్రీతి ప్రస్తుతం విధమ్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పెద్ద అభిమాని. 2010లో తొలిసారి పార్లమెంటుకు ఎంపికైన ప్రీతికి ఇదే మొట్టమొదటి ప్రభుత్వ పదవి. లండన్‌లో జన్మించిన ప్రీతి కన్సర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన మొదటి ఆసియా మహిళా ఎంపీ. ఆమె తల్లిదండ్రులు నోర్ఫోల్క్‌లో గ్రామీణ పోస్టాఫీసును నిర్వహిస్తున్నారు.

కీలే యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందిన ఆమె పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. గత నెలలో భారత్‌లో పర్యటించిన బ్రిటన్ అత్యున్నత స్థాయి కమిటీలో ఆమె సభ్యురాలు. ఈ సందర్భంగా ఆమె మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో-బ్రిటన్ సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు. ఓ బ్రిటన్ పత్రికకు రాసిన వ్యాసంలో దేశాన్ని సంస్కరణల బాటలో నడపాలని భావిస్తున్న మోడీకి అంతా మంచే జరగాలని, మోడీ తమకు మంచి మిత్రుడని, ఆయనకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement