130 కోట్ల మంది కల.. నవభారతం | Sakshi
Sakshi News home page

130 కోట్ల మంది కల.. నవభారతం

Published Mon, Jan 29 2018 12:25 PM

Budget session began with President Kovind speech - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలోని చిట్టచివరి వ్యక్తి దాకా అభివృద్ధి ఫలాలు చేరాలన్న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గంలో కేంద్ర ప్రభుత్వం పయనిస్తున్నదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ యవనికపైనా సత్తాచాటుతున్నదన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు(సోమవారం) ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి ‘నూతన భారతం’గా రూపాంతరం చెందుతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

సుదీర్ఘ ప్రసంగం : కోవింద్‌ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్‌ సమావేశాలు ఇవే కావడంతో ఆయన ప్రసంగంపై ఆసక్తినెలకొంది. ‘‘ఇటీవలే మనం సంక్రాంతి, పొంగల్‌ తదితర పండుగలు చేసుకున్నాం. గణతంత్రదినోత్సవం కూడా మనకు చాలా ముఖ్యమైన పండుగ. ఆ సందర్భంలో ఆసియాన్‌ దేశాల ప్రతినిధులను ఆహ్వానించి, వసుధైక కుటుంబాన్ని నిర్మించే ప్రయత్నం చేశాం. నూతన భారత స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన మీరంతా(సభ్యులు) కీలక భూమిక పోషిస్తున్నారు..’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కోవింద్‌ ప్రసంగంలో ముఖ్యాశాలు..
⇒ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేకపోతే రాజకీయ ప్రజాస్వామ్య అంతిమ లక్ష్యం పూర్తికాదన్న బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్నది. సామాజిక న్యాయంతోపాటు ఆర్థిక స్వావలంబనకు విశేషప్రాధాన్యం ఇస్తున్నది.
⇒ పెద్ద ఎత్తున మరుగుదొడ్లను నిర్మించి స్త్రీల గౌరవాన్ని కాపాడుకున్నాం. ఇది కూడా సామాజిక న్యాయమే.
⇒ మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి భారత్‌ను.. పరిపూర్ణ స్వచ్ఛభారత్‌ (పరిశుభ్రమైన దేశంగా) మార్చేయాలి.
⇒ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రభుత్వం లక్షల సంఖ్యలో గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. తద్వారా మహిళలు కట్టెలు, బొగ్గులపై వంట చేస్తే బాధను తొలగించగలిగారు.
⇒ త్రిపుల్‌ తలాక్‌ చట్టం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం.
⇒ గర్భందాల్చే ఉద్యోగినులకు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరుచేశాం.
⇒ బేటీ బచావో, బేటీ పడావో లాంటి కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నాం.
⇒ ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా సుమారు రూ4లక్షల కోట్ల రుణాలను అందించాం
వ్యవసాయ, విద్యుత్‌, విద్యా రంగాల్లో మునుపటికంటే ఘనమైన ప్రగతిని సాధించాం.
దేశంలో ఏదొఒక చోట నిరంతరం ఎన్నికలు జరుతుంటాయి. ఆ విధానానికి స్వస్తిపలకి, జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆర్థికాభివృద్ధి, స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడమేకాక ఆ వర్గాలకు అవసరమైన చేయూత అందించడంలో ప్రభుత్వం ఎల్లపుడూ ముందుంటుంది.
2022లోగా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.
జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ప్రజలకు సేవలను దగ్గరచేశాం.
ప్రధాన మంత్రి జన్‌ ఔషది యోజన ద్వారా సుమారు 800 రకాల మందులను అతితక్కువ ధరకు అందిస్తున్నాం
స్టంట్ల ధరలను తగ్గించి, దాదాపు 500 జిల్లాల్లో డయాలసీస్‌ కేంద్రాలను ఏర్పాటుచేశాం.
రైల్వే వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నాం. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్‌ రైలును ఏర్పాటుచేశాం.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు వైమానిక సేవలను దగ్గరచేసే క్రమంలో ద్వితీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలను ప్రారంభించాం
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. అసోం-అరుణాచల్‌ను అనుసంధానించే డోలా సాధియా వంతెను ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
దేశంలో వామపక్ష తీవ్రవాదం క్రమంగా బలహీనపడుతున్నది. గత మూడేళ్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ జనజీవన స్రవంతిలో కలిశారు.
జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం అన్ని వర్గాలనూ చర్చలకు ఆహ్వానించాం. సైనిక, అర్థసైనిక బలగాలు చొరబాట్లను గట్టిగా తిప్పికొడుతున్నారు.

Advertisement
Advertisement