‘సుప్రీం ఆదేశాల’పై ఆర్డినెన్స్ | Sakshi
Sakshi News home page

‘సుప్రీం ఆదేశాల’పై ఆర్డినెన్స్

Published Wed, Sep 25 2013 4:59 AM

Cabinet passes ordinance to undo Supreme Court order on convicted netas

న్యూఢిల్లీ: ఏదైనా కేసులో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు తక్షణం అనర్హత వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షకు అవకాశంగల ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితుడైన ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకు కానీ, ఎమ్మెల్సీకి కానీ తక్షణమే అనర్హత వర్తిస్తుందని సుప్రీంకోర్టు జూలై 10వ తేదీన తన తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చిన విషయమూ విదితమే.
 
 ఈ ఆదేశాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చట్టాన్ని సవరించే లక్ష్యంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం (రెండో సవరణ) బిల్లు, 2013ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేదు. దీంతో.. సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్వీర్యం చేస్తూ చట్ట సవరణ స్థానంలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇటీవల అవి నీతి, ఇతర నేరాలకు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ ఎంపీ రషీద్‌మసూద్‌ను విచారణ కోర్టు దోషిగా నిర్ధారించిన నేపధ్యంలో ఆయనకు అనర్హత వర్తించే అవకాశాలున్న నేపధ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను ముందుకు తేవటం విశేషం. ఈ కేసుకు సం బంధించి సీబీఐ కోర్టు వచ్చే నెలలో శిక్షను ఖరా రు చేసిన వెంటనే.. మసూద్‌కు అనర్హత వర్తించి, ఆయ న రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశముంది.
 
 ఆర్డినెన్స్ దొడ్డిదారి పద్ధతి కాదు: కాంగ్రెస్
 దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులకు తక్షణం అనర్హత వర్తించకుండా ఉండేలా ఆర్డినెన్స్ తేవటం దొడ్డిదారి పద్ధతి కాదని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై విమర్శలను కొట్టివేసింది. ఆర్డినెన్స్ కూడా పార్లమెంటుకు వెళ్లాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ‘ఆర్డినెన్స్ అనేది అప్రజాస్వామిక పద్ధతి కాదు. అది దొడ్డిదారి పద్ధతి కాదు.దానికి పార్లమెంటు ఆమోదం అవసరం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ఆర్డినెన్స్ పార్లమెంటుకు వెళ్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.సి.చాకో ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
 
 ‘బొగ్గు’వేలం పద్ధతికి ఆమోదం
 బొగ్గు బ్లాకుల వేలానికి అనుసరించాల్సిన పద్ధతిని కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. దీని ప్రకారం పర్యావరణ శాఖ సమీక్షించిన తర్వాతే బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టడం జరుగుతుంది. వేలంలో పాల్గొనే బిడ్డర్లు కనీస పని కార్యక్రమానికి అంగీకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement
Advertisement