ఎల్‌పీజీపై కేంద్రం కాకి లెక్కలను కనిపెట్టిన కాగ్ | Sakshi
Sakshi News home page

ఎల్‌పీజీపై కేంద్రం కాకి లెక్కలను కనిపెట్టిన కాగ్

Published Wed, Aug 17 2016 5:23 PM

ఎల్‌పీజీపై కేంద్రం కాకి లెక్కలను కనిపెట్టిన కాగ్ - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్ వినియోగదారుల ఎల్‌పీజీ సిలిండర్ల కనెక్షన్లకు ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా డూప్లికేట్ కనెక్షన్లను సమూలంగా నిర్మూలించామని, నగదు బదిలీ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా, సంపన్నులు స్వచ్ఛంగా ఎల్‌పీజీ సబ్సిడీని వదులు కోవడం స్కీమ్‌ను ప్రోత్సహించడం ద్వారా భారత ఖజానాకు 23 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని మిగిల్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ విషయంలో గతవారం కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రభుత్వ లెక్కల గారఢీని బట్టబయలు చేసింది.
 

 ప్రభుత్వం చెబుతున్న 23వేల కోట్ల రూపాయల సబ్సిడీలో 92 శాతం నిధులు అంతర్జాతీయంగా చమురు నిధులు తగ్గడం వల్ల సమకూరినవేనని తేల్చి చెపింది. కేవలం నగదు బదిలీ స్కీమ్ వల్ల ఎనిమిది శాతం నిధులు, అంటే 1,764 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయని కాగ్ పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవిలో తాను రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌పీజీల్లో సబ్సిడీల లీకును అరికట్టడం ద్వారా 15 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని తగ్గించగలిగామని చెప్పారు. ఈ సబ్సిడీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 12,700 కోట్ల రూపాయలకు మించదని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమనియన్ గత ఏప్రిల్ నెలలోనే తన మీడియా కాలంలో రాయడం ఇక్కడ గమనార్హం. ఒక్క 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే 9,211 కోట్ల రూపాయలను ఆదా చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంది. వాస్తవానికి ఆ కాలానికి 4.813 కోట్ల రూపాయలు మాత్రమే ఆదా చేయగలిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది.
 

 నగదు బదిలీ స్కీమ్ ద్వారా మిగలాల్సిన సబ్సిడీ నిధులు ఎక్కడికి పోతున్నాయి? బోగస్ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమా? ఇప్పటికీ కొంత మంది వినియోగదారులు బహుళ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ కాగ్ తన నివేదికలోనే సమాధానాలు ఇచ్చింది. దేశంలోని సగటు ఎల్‌పీజీ వినియోగదారుడు గతంలో సగటున ఏడాదికి 6.7 సిలిండర్లను వినియోగించుకోగా, ఇప్పుడు ఏడాదికి దాదాపు 11 సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. (ఏడాదికి సబ్సిడీ సిలిండర్లు 12కు మించి ఇవ్వరనే విషయం తెల్సిందే) అంటే అధనపు సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనే అంశం అర్థం అవుతోంది. 2014-15 సంవత్సరంలో 3.34 కోట్లు, 2015-16 సంవత్సరంలో 3.56 కోట్ల బోగస్ ఎల్‌పీజీ కనెక్షన్లను తొలగించామన్న ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో కూడా పొరపాట్లు ఉన్నాయని కాగ్ పేర్కొంది. వీటిలో బోగస్ కనెక్షన్లు ఇప్పటికీ కొనసాగుతుండడమే కాకుండా ఆధార్ కార్డులేని అర్హులైన వినియోగదారులు కూడా ఉన్నారు. బోగస్ కనెక్షన్లు, బహుళ కనెక్షన్లు పూర్తిగా నిర్మూలించేందుకు ఆధార్ కార్డులను లింక్ చేసినప్పటికీ ఒకే ఆధార్ కార్డు నెంబర్‌పై పలు కనెక్షన్లు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని కాగ్ పేర్కొంది. ఇలాంటి బోగస్ కనెక్షన్లు దాదాపు 50 శాతం కొనసాగుతుండగా, వారిలో 20 శాతం మంది ఇప్పటికీ సబ్సిడీలు పొందుతున్నారని తెలిపింది. దీనికి కారణం దేశంలోని ఎల్‌పీజీ వినియోగదారుల డేటా బేస్ సరిగ్గా లేకపోవడమేనని చెప్పింది.
 

 నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల కనెక్షన్లు 34 శాతం పెరిగాయంటూ కేంద్రం చెబుతున్న లెక్కలు కరెక్టేనని, వాటిలో మెజారిటీ వినియోగదారులు ఈ కనెక్షన్లను కమర్షియల్ పర్పసే వాడుతున్నారని, దానివల్ల ప్రభుత్వానికి నష్టమే వాటిల్లుతోందని కాగ్ వెల్లడించింది.

Advertisement
Advertisement