నేడే సీబీఐ చీఫ్ ఎంపిక | Sakshi
Sakshi News home page

నేడే సీబీఐ చీఫ్ ఎంపిక

Published Tue, Dec 2 2014 5:04 AM

CBI chief choice today

  • ప్రధాని నేతృత్వంలో భేటీ కానున్న కమిటీ
  • న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌ను ఎన్నుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సమావేశం కానుంది. సీబీఐ ప్రస్తుత డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. సీబీఐ డెరైక్టర్ నియామక కమిటీలో లోక్‌సభలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కూడా చేరుస్తూ రూపొందించిన సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో.. ఆ కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా స్థానం లభించింది.

    కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన తరఫు ప్రతినిధి కూడా ఉంటారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి సీబీఐ డెరైక్టర్ నియామకం ఇదే. ప్రస్తుతం సీబీఐ చీఫ్ రేసులో రాజస్తాన్ డీజీపీ ఒమేంద్ర భరద్వాజ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకాశ్ మిశ్రాలు ముందంజలో ఉన్నారు. వీరిద్దరూ 1977 కేడర్ ఐపీఎస్ అధికారులు. అలాగే, కేరళ పోలీస్ చీఫ్, 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరు కూడా వినిపిస్తోంది.
     
    సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించిన సవరణ బిల్లు(ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(అమెండ్‌మెంట్)బిల్, 2014)ను గతవారం పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ శనివారం ఆమోదం తెలిపారని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిల్లులో చేర్చిన సవరణ ప్రకారం.. లోక్‌సభలో అధికారిక ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష  నేతకు సీబీ ఐ డెరైక్టర్ ఎంపిక కమిటీలో స్థానం కల్పిస్తారు.

Advertisement
Advertisement