డీజీపీ దినేశ్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు | Sakshi
Sakshi News home page

డీజీపీ దినేశ్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు

Published Sat, Sep 7 2013 2:37 AM

డీజీపీ దినేశ్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు

ఉమేశ్‌కుమార్ ‘ఫోర్జరీ’పై దర్యాప్తు కొనసాగుతుంది: సుప్రీం
 సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పార్లమెంటు సభ్యుడు ఎం.ఎ.కాన్ సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్‌పై కూడా విచారణ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డీజీపీపై ఫిర్యాదు కాపీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి దర్యాప్తు చేపట్టాల్సిందిగా నిర్దేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తూ చేపట్టకపోవటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ‘రాష్ట్ర పోలీస్ బాస్‌పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిం చటం దిగ్భ్రాంతి కలిగించింది’ అని పేర్కొంది. డీజీపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, దర్యాప్తుపై స్థాయీ నివేదికను నాలుగు వారాల్లో తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
 
 రాష్ట్రానికే చెందిన ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ దాఖలుచేసిన అప్పీలును విచారించిన జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసిం ది. డీజీపీ దినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఉమేశ్‌కుమార్ ఒక ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేయటానికి ఫోర్జరీ చేసినప్పటికీ.. దినేశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణల్లో బలం ఉన్నందున దీనిపై దర్యాప్తు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ‘ఫిర్యాదు బూటకమైనప్పటికీ, దానితో జతపరిచిన సేల్ డీడ్లను అక్రమమార్గంలో సేకరించినవైనప్పటికీ, ఆ పత్రాలు బూటకపు పత్రాలుగా నిర్ధారణకాలేదు. ఆరోపణల్లో కొంత బలం ఉన్నట్లయితే, ప్రతివాదికి (దినేశ్‌రెడ్డికి) నేరంలో భాగస్వామ్యం ఉన్నదని బలప రచే భౌతిక ఆధారాలు ఉన్నట్లయితే.. ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించాలి.. అంతేకానీ కక్ష సాధించటానికో, మరేదో స్వార్థ లక్ష్యం కోసమో ఫిర్యాదు చేశారనే ప్రాతిపదిక మీద దానిని కొట్టివేయకూడదు’ అని స్పష్టంచేసింది.

Advertisement
Advertisement