ఆ పోలీసులకు ఉరే సరి | Sakshi
Sakshi News home page

ఆ పోలీసులకు ఉరే సరి

Published Sat, Jun 7 2014 3:51 PM

ఆ పోలీసులకు ఉరే సరి - Sakshi

ఉత్తరాఖండ్లో బూటకపు ఎన్కౌంటర్లో 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కాల్చి చంపిన 17 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించాలని సీబీఐ కోరుతోంది. వాళ్లకు విధించే శిక్ష ఈ సమాజం మొత్తానికి ఓ గుణపాఠం కావాలని వాదించింది. దీంతోపాటు బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని కోరింది. ఈ కేసులో మొత్తం 18 మంది పోలీసులను నిందితులుగా పేర్కొనగా, వారిలో ఏడుగురిపై హత్య, పదిమందిపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్ నేరాలు రుజువైనట్లు ఢిల్లీలోని సీబీఐ కోర్టు  శుక్రవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మరొకరిపై కేవలం సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు మాత్రమే రుజువైంది.

ఘజియాబాద్కు చెందిన ఎంబీఏ విద్యార్థి రణ్బీర్ సింగ్ 2009 జూలైలో డెహ్రాడూన్లోని మోహిని రోడ్డులో 29 బుల్లెట్ గాయాలు తగిలి మరణించి కనిపించాడు. అతడు బెదిరింపుల రాకెట్ నడుపుతున్నాడని పోలీసులు ఆరోపించారు. కానీ, అది తప్పని తేలింది. కోర్టు మొత్తం 17 మంది పోలీసులను దోషులుగా తేల్చి, సోమవారం నాడు వారికి శిక్ష విషయం తేలుస్తామని తెలిపింది. దాంతో, దోషులందరికీ ఉరిశిక్ష విధించాల్సిందేనని ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కోరారు.

Advertisement
Advertisement