ఫైళ్ల గల్లంతుపై ప్రాథమిక విచారణ | Sakshi
Sakshi News home page

ఫైళ్ల గల్లంతుపై ప్రాథమిక విచారణ

Published Fri, Sep 20 2013 4:36 AM

CBI to register PEs in missing coal files case

న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై సీబీఐ రెండు రోజుల్లోగా ప్రాథమిక విచారణ (పీఈ) ప్రారంభించనుంది. బొగ్గుశాఖ అధికారులతో గురువారం సీబీఐ అధికారులు సమావేశమైన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న ఫైళ్ల వివరాలతో బొగ్గుశాఖ బుధవారం సీబీఐకి ఒక లేఖ రాసింది. దీనినే ఫిర్యాదుగా పరిగణిస్తూ, దర్యాప్తు ప్రారంభించాలని కోరింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి 15 నుంచి 18 ఫైళ్లు గల్లంతైనట్లు బొగ్గుశాఖ అధికారులు, సీబీఐ అధికారులు ఈ సమావేశంలో నిర్ధారణకు వచ్చారు.
 
 తొలుత దీనిపై నేరుగా దర్యాప్తు ప్రారంభించాలని భావించినా, మొదట ప్రాథమిక విచారణ ప్రారంభించి, సాక్ష్యాధారాలు దొరికితే, కేసు నమోదు చేసుకోవచ్చని సీబీఐ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 26వ స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు సహా కొన్ని ఫైళ్లు గల్లంతైన విషయాన్ని బొగ్గుశాఖ అధికారులతో జరిపిన చర్చల్లో సీబీఐ అధికారులు గుర్తించారని, ఎంతగానో ప్రయత్నిస్తే ఆ సమావేశం మినిట్స్ ముసాయిదా మాత్రమే దొరికిందని చెప్పాయి.

 

బొగ్గు బ్లాకుల కేటాయింపులపై ఇప్పటికే కొనసాగుతున్న 13 కేసులకు సంబంధించిన కీలకమైన రికార్డుల కోసం సీబీఐ అన్వేషిస్తోంది. గల్లంతైన వాటిలో ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దా రాసిన సిఫారసు లేఖ కూడా ఉంది. సీబీఐ గత వారం విడుదల చేసిన జాబితాలో తనకు బొగ్గుశాఖ నుంచి ఇంకా 150 ఫైళ్లు, పత్రాలు అందలేదని వెల్లడించింది. ‘బొగ్గు’ కేసుపై ఆగస్టు 29న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దర్యాప్తుకు అవసరమైన ఫైళ్ల జాబితాను బొగ్గుశాఖకు ఇవ్వాలని, బొగ్గుశాఖ రెండు వారాల్లోగా సీబీఐకి వాటిని అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement