ఎన్నికల్లో కాంగ్రెస్ బదులు సీబీఐ : మోడీ | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో కాంగ్రెస్ బదులు సీబీఐ :మోడీ

Published Thu, Sep 26 2013 5:14 AM

ఎన్నికల్లో కాంగ్రెస్ బదులు సీబీఐ : మోడీ - Sakshi

భోపాల్: యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని వాడుకుంటోందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, లోక్‌సభకు జరిగే తదుపరి సాధారణ ఎన్నికల్లోగానీ కాంగ్రెస్ పోటీ చేయదని, బదులుగా తన తరఫున సీబీఐనే రంగంలోకి దింపుతుందని మోడీ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, ఇటువంటి సర్కారును తక్షణం కూలదోయాల్సిన అవసరం ఉందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అవినీతినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆఖరి కోరిక మేరకు కాంగ్రెస్‌ను మూసేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.
 
 ఒకే వేదికపై మోడీ, అద్వానీ: బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బుధవారం ఒకే వేదికపై కనిపించారు. భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వీరు కలిసి పాల్గొన్నారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక, వీరు బహిరంగ వేదికలపై కలసి పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే వారిద్దరి మధ్య సఖ్యత కనిపించలేదు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలు కష్టించి పనిచేయడంవల్లే బీజేపీ నేడు ఇంతటి స్థితికి చేరుకుందని, అంతేకాని నాయకుల అనర్గళ ఉపన్యాసాలవల్ల కాదని అద్వానీ ఈ సందర్భంగా అన్నారు.
 
 కమిటీలకే కేంద్రం పరిమితం
 అహ్మదాబాద్: దేశంలోని యువతకు నైపుణ్యాలను పెంచడంలో కేంద్రం విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రానికి ఒక విధానమంటూ లేకుండా పోయిందని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఆయన జాతీయ నైపుణ్య అభివృద్ధి సదస్సును ప్రారంభించారు. కేంద్రం ఏ సమస్య వచ్చిన కమిటీలు వేయడం, వాటిని మూసేయడం వరకే పరిమితం అవుతోందని అన్నారు. కేంద్రం సాచివేత ధోరణివల్ల విలువైన సమయం వృథా అయిందని, యువత నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు.  2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పేరుతో మంత్రులతో కమిటీని ఏర్పా టు చేసిందని తర్వాత జాతీయ అభివృద్ధి బోర్డును నెలకొల్పిందని, అయితే ఈ రెండూ ఇప్పటివరకు సాధించిందేమీ లేదని అన్నారు.

Advertisement
Advertisement