మే 6న ‘నీట్‌’ | Sakshi
Sakshi News home page

మే 6న ‘నీట్‌’

Published Tue, Jan 23 2018 1:53 AM

Cbse official Says NEET 2018 to be held on May 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్య విద్యలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)–2018కు ఏర్పాట్లు మొదలయ్యాయి. పరీక్షను మే 6న నిర్వహించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెలాఖరులో ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని, మార్చితో ముగుస్తుందని, ఫీజు చెల్లింపు గడువు మార్చితోనే పూర్తవుతుందని తెలిపింది. 

ఈ మూడు ప్రక్రియలకు సంబంధించి కచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. జూన్‌ మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని.. జూన్‌ 12న కౌన్సెలింగ్‌ మొదలవుతుందని, ఆగస్టు 31తో అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేసింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) మినహా దేశవ్యాప్తంగా అన్ని వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలు నీట్‌ ర్యాంకుల ప్రకారమే జరగనున్నాయి.

రాష్ట్రంలో 60 వేల మంది
నీట్‌–2017కు రాష్ట్రం నుంచి 56,804 మంది హాజరు కాగా.. ఈ ఏడాది 60 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష నిర్వహిం చనున్నారు. గతేడాది హైదరాబాద్‌లో 59, వరంగల్‌లో 16 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. పరీక్షలో 180 ప్రశ్నలు, 720 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతోపాటు మరో ఏడు భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో బీడీఎస్, ఎంబీబీ ఎస్, ఆయుష్‌ కోర్సుల సీట్లను నీట్‌ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలో 3,200 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్, 695 ఆయుష్‌ సీట్లున్నాయి. వచ్చే ఏడాది సిద్దిపేట వైద్య కళాశాలకు అనుమతి రానుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement