కరువుపై కేంద్రానికి ప్రణాళికేది? | Sakshi
Sakshi News home page

కరువుపై కేంద్రానికి ప్రణాళికేది?

Published Thu, May 12 2016 4:49 AM

కరువుపై కేంద్రానికి ప్రణాళికేది? - Sakshi

♦ పార్లమెంటులో చర్చ తప్ప విధానాల్లో మార్పేది
♦ లోక్‌సభలో ఎంపీ కవిత ప్రశ్న
♦ కరువును నిర్వచించే విధానం మారాలి
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వానికి శాశ్వత ప్రణాళికే లేకుండా పోయిందని, బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నామని, కరువును పారదోలేందుకు తక్షణం విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం కరువు, దుర్భిక్ష పరిస్థితుల అంశంపై లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె ప్రసంగించారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల విషయాల్లో స్పష్టమైన విధానం లేకుండా పోయింది. వరదలు వచ్చినప్పుడు పర్యటించడం, ఆ తర్వాత పార్లమెంటులో చర్చలు చేయడంతోనే సరిపోతోంది.

కరువుతో మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ.3,064 కోట్ల ఆర్థిక సాయం కోసం ప్రతిపాదనలు పంపితే కేంద్రం రూ.791 కోట్లతో సరిపెట్టింది. తెలంగాణ అడిగిన మేరకు ఆర్థిక సాయం చేయడంతో పాటు పునర్‌విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులను మంజూరు చేయాలి..’’ అని ఆమె కోరారు.  నీటి విషయంలోనూ ఒకవైపు వరదలు సంభవిస్తూ సముద్రంలోకి చాలా నీరు వెళ్లిపోతోంది. మరోవైపు తాగడానికి వాటిని వినియోగించుకోలేకపోతున్నాం అని కవిత వివరించారు.

 కరువును ఎలా నిర్వచిస్తున్నాం?
 కరువును నిర్వచించడంలో ఇప్పటికీ మనం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్నే అనుసరిస్తున్నామని కవిత పేర్కొన్నారు.  ‘‘నాలుగు అంశాల ఆధారంగానే కరువును నిర్ణయిస్తున్నాం. సగటు వర్షపాతం, వర్షాభావం, సాగుబడి విస్తీర్ణం తదితర అంశాలన్నీ బ్రిటిష్ కాలంలో రూపొందించినవే. కేవలం సాగు విస్తీర్ణం తగ్గితే మాత్రమే కరువు ఉన్నట్టుగా భావించే విధానాలు మార్చాలి. అలాగే వరుసగా 30-35 రోజుల పాటు వర్షాలు కురవకపోతే ఆ ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించే విధానం ప్రస్తుతం అమలవుతోంది. చివరి ఒకట్రెండు రోజుల్లో వర్షం కురిసినా ఆ ప్రాంతం కరువు కిందకు రావడం లేదు. ఇది క్షేతస్థాయిలో కనిపించే పరిస్థితిని ప్రతిబింబించడం లేదు..’’ అని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ప్రధానిని ఆలస్యంగా కలిశారంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని కవిత తప్పుపట్టారు.

Advertisement
Advertisement