పినరాయ్‌ విజయన్‌పైనే వారి ఆశలు | Sakshi
Sakshi News home page

పినరాయ్‌ విజయన్‌పైనే వారి ఆశలు

Published Thu, Jun 1 2017 6:34 PM

పినరాయ్‌ విజయన్‌పైనే వారి ఆశలు

తిరువనంతపురం: కబేళాలకు తరలించేవారికి పశువులను విక్రయించరాదంటూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల ప్రభావం కేరళ మార్కెట్‌పై అప్పుడే కనిపించింది. కేంద్రం ఆంక్షలు ఇంకా అమల్లోకి రానప్పటికీ కేరళలోని మల్లప్పురం జిల్లా చెలేరి పశువుల సంత మంగళవారం బోసి పోయింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రతి వారం చెలేరి సంతకు 50 ట్రక్కులకుపైగా పశువులను తరలించుకు వచ్చేవారు వ్యాపారులు. పశువుల్లో బర్రెలు, ఎద్దులే ఎక్కువగా ఉండేవి. 
 
నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఓ ప్రైవేటు మైదానంలో జరిగే ఈ సంతకు ఎప్పుడూ ఎంతో డిమాండ్‌ ఉండేది. మొన్న 20 ట్రక్కులు ఖాళీగా సంత స్థలంలోనే ఉండిపోయాయి. ఈ వాహనాలు ఊరూరా తిరిగి విక్రయించే పశువులను సంతకు తీసుకొచ్చేవి. ప్రతి వారం ఈ సంతలో వెయ్యి పశువులకు డిమాండ్‌ ఉంటుందట. మొన్న 300 పశువులకు కూడా డిమాండ్‌ లేదు. పరిస్థితులను ముందే ఊహించిన రైతులు పశువులను సంతకు తరలించలేదు. 'నేను ప్రతివారం 50 పశువులను సంతకు తీసుకొచ్చి అమ్ముతాను. ఈ సారి 20 పశువులను కూడా అమ్మలేక పోయాను' వెంగరలో గొడ్ల శాలను కలిగిన బవుట్టి తెలిపారు. 
 
ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేయాల్సి వస్తుందా ? అని పశువుల వ్యాపారులు ఒకరినొకరు పలకరించుకోవడం కనిపించింది. ఉపాధి కోసం మరే వ్యాపారం చేయాలో అంతుచిక్కడం లేదని కొంత మంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం దెబ్బతినకుండా తమ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న విశ్వాసం ఎక్కువ మందిలో కనిపించింది. కేంద్రం విధించిన ఆంక్షలను అమలు చేయమని, సుప్రీం కోర్టు వరకు వెళతానని విజయన్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. నాలుగు టన్నుల బర్రె లక్ష రూపాయలకు, టన్ను బరువుండే బర్రెలు 20వేలకు, ఎద్దులు 20 వేల రూపాయల నుంచి 60 వేలకు ఈ సంతలో అమ్ముడు పోయేవి. 
 

Advertisement
Advertisement