ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 1నే బడ్జెట్‌

Published Thu, Jan 19 2017 3:36 AM

ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ - Sakshi

‘ఎన్నికల’ రాష్ట్రాలకు వరాలుండవు: కేంద్రం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటినే 2017–18 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనుంది. అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలు లేకుండా జాగ్రత్త వహించనుంది. ‘బడ్జెట్‌ సమర్పణ ఫిబ్రవరి ఒకటినే ఉంటుంది.  ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలేవీ ఉండవు’ అని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఐదు రాష్ట్రాల తొలి దశ ఎన్నికలు జరగనున్న ఫిబ్రవరి 4వ తేదీకి ముందు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సరికాదంటూ కాంగ్రెస్, టీఎంసీసహా ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. ముందస్తు బడ్జెట్‌ సమర్పించడానికి గల కారణాన్ని ఎన్నికల సంఘానికి విన్నవించింది.

కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజు అయిన ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెట్టుబడులతో కూడిన పథకాలు పక్కాగా ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. పార్లమెంటు  సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి ఒకటిన అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారు. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి, దాన్ని సాధారణ బడ్జెట్‌లో కలిపేయాలని కేబినెట్‌ గతంలో నిర్ణయించింది.

Advertisement
Advertisement