Sakshi News home page

'ఆ దాహమే భార్యను చంపేసింది'

Published Sat, Jul 5 2014 10:40 AM

'ఆ దాహమే భార్యను చంపేసింది'

శ్రీకాకుళానికి చెందిన మృత్యుంజయుని దీనగాథ
 చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నైలో 11 అంతస్తుల అపార్టుమెంటు 61 మందిని పొట్టనపెట్టుకున్న విషయం విదితమే. 27 మందిని క్షతగాత్రులుగా మిగిల్చింది. శుక్రవారం ఒడిశాకు చెందిన ఒక యువకుడితోపాటు శ్రీకాకుళం జిల్లా కేబొమ్మాళి మండలం, గుడివాడ గ్రామానికి చెందిన చుక్కా మహేష్ శిథిలాల కింద నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్ర మాదం జరిగిన 66 గంటల తరువాత మృత్యుంజ యులుగా వచ్చి అబ్బురపరిచారు. అయితే అతను ఎవరికోసం జీవించాలన్న నిర్లిప్తతలో మునిగిపోయూడు. ఐదు నెలల క్రితం పెళ్లికాగా భార్య సుజాత కళ్లెదురుగానే భూమిలో కలిసిపోయింది. ఇద్దరూ ప్రేమించుకుని, గత ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు. సుజాత తల్లిదండ్రులు సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మి, సోదరి సునీత ప్రమాదం చోటుచేసుకున్న అపార్టుమెంటులో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు రోజే ఇక్కడికి వచ్చారు. 28వ తేదీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూర్చుని ఉండగా రెప్పపాటులో వారున్న చోటు భూమిలో కూరుకుపోయింది.
 
 తెలివి వచ్చేసరికి పడుకున్న స్థితిలో ఉన్న తమపై బలమైన ఇనుప గొట్టాలు వాటిపైన సిమెంటు ఫలకాలు ఉన్నట్లు మహేష్ తెలిపాడు. తాము నలిగిపోకుండా ఇనుపగొట్టాలు కాపాడాయన్నాడు. తామున్న చోటే వాటర్ క్యాన్  ఉండడంతో అందుకునే ప్రయత్నం చేశానని, ఇనుపగొట్టాలు కదిలి సిమెంటు దిమ్మెలు పైనబడి తాను చూస్తుండగానే సుజాత(23) శిథిలాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచిందని చెప్పాడు. తన దాహమే భార్యను దూరం చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో మామ సూర్యనారాయణ రెడ్డి (47), మరదలు సునీత (19) చనిపోగా, అత్త లక్ష్మీ (35) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మార్చురీలో ఉన్న భార్య సుజాత మృతదేహం కోసం రాయపేట ఆస్పత్రిలో మహేష్ కుంటుకుంటూ అధికారుల చుట్టూ తిరగడం చూపరులను కలచివేసింది. కాగా ఈ ప్రమాదంలో 38 మంది ఉత్తరాంధ్ర వారు చనిపోయినట్లు తేల్చారు. విజయనగరం జిల్లాకు చెందిన 24, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 14 మంది మృతుల్లో ఉన్నారు.
 
 
 శునకాల కృషి అపారం...
 జాతీయ విపత్తుల నివారణ బృందం వెంట ఉన్న రుస్తుం, దిల్ అనే శునకాలు శ్రీకాకుళం జిల్లా వాసి మహేశ్ సహా మొత్తం 9 మందిని రక్షించాయి.

Advertisement

What’s your opinion

Advertisement