పెట్రోలుతో నడిచే హెలికాప్టర్! | Sakshi
Sakshi News home page

పెట్రోలుతో నడిచే హెలికాప్టర్!

Published Mon, Nov 28 2016 10:27 AM

పెట్రోలుతో నడిచే హెలికాప్టర్!

సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లు పనిచేయాలంటే వాటికి వేరే ఇంధనం అవసరం. కానీ, సాధారణ పెట్రోలుతో పనిచేసే హెలికాప్టర్లను గుర్‌గ్రామ్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానయాన సంస్థ తయారుచేస్తోంది. రెండు సీట్లు మాత్రమే ఉండే ఈ హెలికాప్టర్ ఖరీదు కోటిన్నర రూపాయలు. ఇంత తక్కువ ఖర్చుతో ప్రజలు తమ సొంత చాపర్‌ను కొనుక్కునేందుకు అవకాశం రావడం మన దేశంలో ఇదే మొదటిసారని కంపెనీ ప్రతినిధి వివేక్ చెప్పారు. ఈ హెలికాప్టర్ ఇంజన్ 135 హార్స్‌పవర్ రోటెక్స్ 92 యూఎల్ఎస్ ఇంజన్‌తో ఉంటుందని, దీనికి పోలండ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని అన్నారు. వీటిని ఆరావళి పర్వత ప్రాంతాల్లోని ఒక ఫాంహౌస్‌లో తయారుచేస్తున్నామని చెప్పారు. స్వదేశీ, విదేశీ కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్ల మేరకు మాత్రమే వీటిని ఇస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 23 నుంచి 26 వరకు తాము లైవ్ డెమో ఇచ్చామని, మరింతమంది కస్టమర్లను ఆకట్టుకోడానికి జనవరి 12న మరో ప్రదర్శన ఇస్తామని అన్నారు. 
 
అయితే.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో దట్టమైన మొక్కలు ఉండటంతో పాటు.. చిరుతలు, హైనాల లాంటి పలురకాల వన్యప్రాణులకు ఇది సహజ ఆవాసం. పైగా ఇక్కడకు దగ్గరలోనే మొహమ్మద్‌పూర్ ఐఏఎఫ్ డిపో, మనేసర్ ఎన్‌ఎస్‌జీ క్యాంపు.. రెండు రక్షణ సంస్థలు ఉన్నాయి. దీంతో ఇక్కడ భద్రతాపరమైన ముప్పు ఉంటుందని అంటున్నారు. 
 
కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ప్రాజెక్టు సైట్‌ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి రావు నబీర్ సింగ్ సందర్శించారు. ఫాంహౌస్‌లోనే ఈ కంపెనీ ఒక రన్‌వేను కూడా ఏర్పాటు చేసుకుంది. రన్‌వే కోసం వందలాది చెట్లను ఈ కంపెనీ నరికేసిందని ఆరోపణలున్నాయి.

Advertisement
Advertisement