Sakshi News home page

‘శబరిమలను ఘర్షణ జోన్‌గా మార్చారు’

Published Thu, Jan 3 2019 3:24 PM

CM Vijayan Says Govt Fulfilled Constitutional Responsibility   - Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి బుధవారం ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్‌గా మలిచేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం​చేశారు.

శబరిమలలోకి ఇద్దరు మహిళల ప్రవేశం నేపథ్యంలో సెక్రటేరియట్‌ ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి తలపడటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్‌ వాహనాలు, 79 కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారని సీఎం వెల్లడించారు.

అల్లరి మూకలు మహిళలపై దాడులకు పాల్పడ్డాయని, మహిళా మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారని చెప్పారు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి నిరసనగా బంద్‌ చేయడమంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు. కాగా కేరళలో శబరిమల కర్మ సమితి పేరుతో హిందూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల హర్తాళ్‌కు పిలుపు ఇచ్చాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు మూడు నెలల కిందట ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కనకదుర్గ (44), బిందు (42) అనే ఇద్దరు మహిళలు అన్ని అడ్డంకులు, కట్టుబాట్లను అధిగమిస్తూ ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. వీరి ఆలయ ప్రవేశంపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్‌ భగ్గుమంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement