పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత.. | Sakshi
Sakshi News home page

పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత..

Published Tue, Apr 21 2020 10:38 AM

Coconut tree climber Gireesh provides food water to Police in Kerala - Sakshi

తిరువనంతపురం : బతుకుదెరువు కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతూ బొండాలు కోసే గిరీష్‌ అనే వ్యక్తి, లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుండి కేరళలోని అలప్పుజాలో పోలీసుల నోళ్లలో తరచూ నానుతున్న పేరు. కలవూరుకు చెందిన గిరీష్‌ కరోనా కష్టకాలంలో పోలీసులు చేస్తున్న సేవలకు గానూ తనకు తోచిన సాయాన్ని చేస్తున్నారు.

‘మాసిపోయిన బట్టలతో, ప్రతిరోజు టూవీలర్‌పై వస్తున్న గిరీష్‌గురించి వాకబు చేయగా, డ్యూటీలో ఉన్న పోలీసులకు అతను ప్రతిరోజు నీళ్లు, స్నాక్స్‌ను అందిస్తున్నారని తెలిసింది’ అని కలవూరు ఎస్‌ఐ జోసెఫ్‌ తెలిపారు. కరోనాపై యుద్ధం చేయడంలో వైద్య సిబ్బందిలాగే  పోలీసులు కూడా ముందు వరుసలో ఉంటున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో గిరీష్‌లాంటి వ్యక్తులు పోలీసులపై చూపించే ప్రత్యేక శ్రద్ధ తమలో నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని జోసెఫ్‌ పేర్కొన్నారు. 

గిరీష్‌ ప్రతి రోజు నీళ్లు, అరటి పళ్లని డ్యూటీలో ఉన్న పోలీసులకు తీసుకువస్తాడని కుంజుమోల్‌ అనే మహిళా పోలీసు తెలిపారు. ‘అతను పోలీసుల కోసం చేస్తున్న ఈ పని, మా పని తీరును ప్రశంసించినట్టుగా భావిస్తాము. డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చే ఆహారం, నీళ్లు ఉన్నా, కొన్ని సందర్భాల్లో లాక్‌డైన్‌ కారణంగా షాపులు తెరవకపోవడంతో మండుటెండల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో అతను చేస్తున్న ఈ చిరు సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది’ అని కుంజుమోల్‌ అన్నారు.

‘అతను పరిమిత ఆదాయంతోనే మాకు ఈ సహాయాన్ని చేస్తున్నారు. టూ వీలర్‌పైన పోలీసులు ఉండే అన్ని పాయింట్ల దగ్గరకు వెళ్లి నీళ్లు, స్నాక్స్‌ ఇస్తున్నారు’ అని మరో మహిళా పోలీసు రెష్మీ తెలిపారు.

ఒక్క కొబ్బరి చెట్టు ఎక్కడానికి గిరీష్‌కు వందరూపాయలకంటే తక్కువగానే వస్తుంది. ‘నా సంపాదన నుంచి కరోనా మహమ్మరిపై మనకోసం పోరాడుతున్న పోలీసులకు ఏదో ఒకటి చేయాలనిపించింది. వాళ్లకు మంచి ఆహారాన్ని ఇవ్వాలని ఉన్నా నా దగ్గర అంత డబ్బులేదు. అందుకే ఉన్నంతలో అరటిపళ్లు, సోడా బాటిళ్లు, స్నాక్స్‌, నీళ్లు వంటివి ఇస్తున్నాను’ అని గిరిష్‌ తెలిపారు.

Advertisement
Advertisement