ట్రాఫిక్ నియంత్రణలో ‘కమ్యూనిటీ పోలీస్’ | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ నియంత్రణలో ‘కమ్యూనిటీ పోలీస్’

Published Tue, Sep 9 2014 10:54 PM

community police in traffic control

సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ జాం సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో పాల్గొనే వారికి ట్రాఫిక్ శాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. వారంలో ఒక రోజు, ఏదో ఒక జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేసే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర పోలీసు శాఖలో ఇదే ప్రథమం.

 నిత్యం ట్రాఫిక్ జాంలు..
 నగర రహదారులపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రోజు దాదాపు 450కి పైగా కొత్త వాహనాలు ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసుకుని రోడ్లపైకి వస్తున్నాయి. ఇలా పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పోలిస్తే నగర రహదారులు ఎటూ సరిపోవడం లేదు.  ఎక్కడ చూసిన ట్రాఫిక్ జాం సమస్య కనిపిస్తోంది. దక్షిణ, మధ్య, ఉత్తర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. పట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులనే కొట్టి పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి.

 ప్రత్యేక శిక్షణ
 ట్రాఫిక్ పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణించిన నగర ట్రాఫిక్ శాఖ ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. స్థానికంగా ఉంటున్న ప్రజలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవా సంస్థల సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) బి.కే.ఉపాధ్యాయ అన్నారు.

 ఇందులో పనిచేసే వారికి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజ్‌లు చూపించి, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించనున్నామన్నారు. వాహనాలను ఎలా అదుపు చేయాలి, ఎలా దారిమళ్లించాలి అనేక ట్రాఫిక్ నియమాలను కమ్యూనిటీ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరిస్తారు.
 ఇలా చేయడం వల్ల నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడమేకాకుండా ట్రాఫిక్ జాం సమస్య   పరిష్కారం కానుందని ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement