కాంగ్రెస్ బ్లూప్రింట్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ బ్లూప్రింట్

Published Mon, Jan 5 2015 4:59 AM

కాంగ్రెస్ బ్లూప్రింట్ - Sakshi

  • పార్టీ బలోపేతంపై అగ్రనాయకత్వం దృష్టి
  • కార్యకర్తల సూచనలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షులకు సోనియా ఆదేశం
  • మార్చికల్లా బ్లూప్రింట్ రూపకల్పన
  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఒక ప్రణాళిక (బ్లూప్రింట్) రూపకల్పనకు  కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని బలోపేతం చేయడానికి దిగువస్థాయి కార్యకర్తలనుంచి సూచనలు, సలహాలు సేకరించాలని పార్టీ చీఫ్ సోనియా గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను కోరినట్టు తెలిసింది. వివిధ వర్గాలనుంచి సేకరించిన సమాచారంతో మార్చినాటికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

    జిల్లా, బ్లాక్ స్థాయినుంచి అభిప్రాయసేకరణ జరపాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇదివరకే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులను కోరారు. ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షులకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. కిందిస్థాయి కార్యకర్తలనుంచి సేకరించిన అభిప్రాయాలతో ఫిబ్రవరి నాటికి తనకు నివేదిక సమర్పించాలని సోనియా కోరినట్టు సమాచారం. మార్చిలో ఏఐసీసీ వార్షిక సమావేశం జరగనుందని, అందులో వీటిపై చర్చ జరుగుతుందని.. అప్పటికల్లా పూర్తి సమాచారంతో పుస్తకరూపంలో ఓ సమగ్ర నివేదిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

    ఈ సమావేశాల్లో చర్చించాక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారని సమాచారం. కాగా, దీనికి ముందు రాహుల్ గత డిసెంబర్ 24న పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారని, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌స్థాయి నాయకులతో మాట్లాడాలని వారిని కోరినట్లు వివరించాయి. రెండు నెలల్లో తనకు నివేదిక సమర్పించాలని ఆయన కోరారు.  రాహుల్  అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్యకర్తలను రాహుల్ కలుసుకున్నారని ఆ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా కిందిస్థాయి కార్యకర్తలనుంచి అభిప్రాయ సేకరణ జరపాల్సిందిగా రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శులను కోరినట్టు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement