‘తలాక్‌’ వ్యూహంలో కాంగ్రెస్‌కు పరాభవం | Sakshi
Sakshi News home page

‘తలాక్‌’ వ్యూహంలో కాంగ్రెస్‌కు పరాభవం

Published Mon, Jan 8 2018 7:04 PM

congress fail in Triple talaq bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళల ప్రయోజనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ‘ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు’ను ఆమోదించకుండానే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాయి. ఇదివరకే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపించాలని ఎక్కువ బలం ఉన్న ప్రతిపక్షం రాజ్యసభలో పట్టుబట్టడంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది. (సాక్షి ప్రత్యేకం) ఈ మొత్తం వ్యవహారంలో లాభ పడింది పాలకపక్ష భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బిల్లులోని అంశాల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించక పోవడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.

ముస్లిం మహిళలను ఆకర్శించడంతో పాటు హిందువులను ఏకం చేయడానికి ఈ బిల్లును భారతీయ జనతా పార్టీ ఆశించినంత ఉపయోగించుకుంది. ముస్లిం పురుషులు తమ భార్యలకు ‘ట్రిపుల్‌ తలాక్‌’ చెబితే అందుకు వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలుగా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ముస్లింలను శిక్షించే బిల్లును తెచ్చామని ఇటు హిందువులను మెప్పించడంతోపాటు ట్రిపుల్‌ తలాక్‌ వల్ల నష్టపోతున్న ముస్లిం మహిళలను రక్షించడం కోసమే ఈ బిల్లును తెచ్చామని మరోవైపు వారిని ఆకర్షించడం బీజేపీ ఉద్దేశం. (సాక్షి ప్రత్యేకం) తన భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పారని ఏ ముస్లిం మహిళ ఫిర్యాదు చేసినా సదరు భర్తపై కేసుపెట్టి మూడేళ్ల పాటు జైలుకు పంపించవచ్చు. ఇక్కడ భర్త జైలుకు వెళ్లడం ఇష్టం లేకపోయినా సరే, అంటే భార్య అనుమతి అవసరం లేకుండానే భర్తను జైలుకు పంపిస్తారు.

పైగా జైల్లో ఉన్న భర్త తాను జైల్లో ఉన్నంతకాలం భార్య, పిల్లల పోషణార్థం భరణం చెల్లించాలని ఉంది. జైలుకెళ్లిన భర్త భరణం ఎలా చెల్లిస్తాడు? జైలుకెళ్లి వచ్చిన భర్త మళ్లీ భార్యను బాగా ఎలా చూసుకుంటాడు? అన్న వివాదాస్పద అంశాలకు బిల్లులో సమాధానం లేదు. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదనడాన్నే ముస్లిం కమ్యూనిటీలో మెజారిటీ మగవాళ్లు అంగీకరించడం లేదు. ఇక వారికి శిక్షలు కూడా విధించే చట్టం వస్తే ముస్లిం మహిళలను వారు రాచి రంపాన పెట్టరా? ఈ విషయంలో ముస్లిం మహిళలకు బిల్లులో తగిన రక్షణలు లేవు. ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు  ముస్లిం మహిళలకు ముప్పుతెచ్చే బిల్లులోని అంశాలను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసి ఉండాల్సింది.

ముస్లిం మగవాళ్లను కాని, మహిళలనుగానీ దూరం చేసుకోవడం ఇష్టంలేని కాంగ్రెస్‌ పార్టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే డిమాండ్‌పైనే ప్రధానంగా గొడవ చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో అంతగా బలంలేని బీజేపీ ప్రభుత్వం దీన్ని తనకు సానుకూలంగా మలుచుకుంది. ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గకుండా, ముస్లిం మహిళల మంచి కోసం బిల్లును తెస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అడ్డం పడుతోందంటూ వాదించి తన పబ్బం గడుపుకుంది. మున్ముందు రాజ్యసభలో బలం పెంచుకునే అవకాశం బీజేపీకీ ఎలాగు ఉంది కనుక అప్పుడు బిల్లును ఆమోదించవచ్చు. (సాక్షి ప్రత్యేకం) ఈలోగా పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కర్నాటక రాష్ట్రంలో విజయం కోసం ఎన్నికల ప్రచారంలో ఈ బిల్లును ప్రధాన ఆయుధం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

Advertisement
Advertisement