బెంగాల్లో కాంగ్రెస్ పొత్తు ఎవరితో? | Sakshi
Sakshi News home page

బెంగాల్లో కాంగ్రెస్ పొత్తు ఎవరితో?

Published Tue, Dec 29 2015 3:24 PM

బెంగాల్లో కాంగ్రెస్ పొత్తు ఎవరితో? - Sakshi

న్యూఢిల్లీ: మరో ఐదు నెలల్లో పశ్చిమ బెంగాల్‌కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. క్రితంలాగే పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా లేదా సీపీఎం పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై సీపీఎం, కోల్‌కతాలో ప్రస్తుతం జరగుతున్న పార్టీ ప్లీనరీలో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తామేమి వ్యతిరేకం కాదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకుడు కారత్ ఇప్పటికే వ్యక్తం చేశారు.

 సీపీఎంతో పెట్టుకోవడం మంచిదని బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం బలంగా కోరుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీతో పొత్తుపెట్టుకోవడమే అన్ని విధాల కలిసొచ్చే అంశమని వారు భావిస్తున్నారు. దీనికి రెండు కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇటీవల ముగిసిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పార్టీతో తృణమూల్ కలసిరావడం. నేషనల్ హెరాల్డ్ వివాదంలో కాంగ్రెస్ పార్టీకీ తృణమూల్ అండగా నిలవడమే కాకుండా కాంగ్రెస్‌తోపాటు సమావేశాలను బాయ్‌కాట్ చేయడం తెల్సిందే. మరో కారణం...కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌ను ఎదుర్కోవాల్సి ఉండడం. ఓ రాష్ట్రంలో వైరి వైఖరి, మరో రాష్ట్రంలో మిత్ర వైఖరి సరిపడదంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిప్రాయం.

 ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎంత సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నా బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం వినిపించుకోవడం లేదు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. పాలకపక్షంతో వెళితే మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు ఉండడమే అందుకు కారణం.  2011లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌తో కలసి పోటీ చేయడం వల్ల మొత్తం 65 సీట్లకు పోటీచేసి 42 సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement