రాఫెల్‌ డీల్‌ : రగులుతున్న రగడ | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ డీల్‌ : రగులుతున్న రగడ

Published Sat, Sep 22 2018 3:56 PM

Congress President Rahul Gandhi Attacks  On PM media over ex-French President Francois Hollande Rafale disclosure - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన  రాఫెల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండే తాజా వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ‍్యలపై వివరణ ఇవ్వాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. హోలెండ్‌ ప్రకటనతో తమ వాదనే నిజమని తేలిందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తన దాడిని ఉధృతం చేశారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అనిల్‌ అంబానీ కంపెనీ ఎంపిక​ భారత ప్రభుత్వానిదేనని హోలెండ్‌ స్పష్టం చేయడంతో భారత ప్రధాని అవినీతిపరుడని తేలిపోయిందంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు. ఈ స్కాం ద్వారా భారీ అవినీతికి పాల్పడి దేశానికి కాపలాదారుడుగా ఉంటానన్న మోదీ దొంగలా (దేశ్‌ కా చౌకీదార్‌ చోర్‌  హై) మారిపోయారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించారు. హోలెండ్‌ ప్రకటన నిజమని అంగీకరించాలి లేదా ఫ్రెంచ్‌ మాజీ అధ్యక్షుడి మాటలు అబద్ధమని అయినా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అనిల్ అంబానీకి మేలు చేయడంకోసమే ప్రధాని మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దివాలా తీసిన అనిల్ అంబానీకి బిల్లియన్ల డాలర్లను కట్టబెట్టేందుకే మోదీ తెరవెనుక రాఫెల్‌ డీల్‌ మార్చారన్నారు. మాజీ రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గానీ, ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌గానీ  ఈ డీల్‌పై  సంతకాలు చేయలేదని స్వయంగా మోదీనే సంతకాలు చేశారని వెల్లడించారు. అలాగే  ఈ డీల్‌ గురించి తనకు తెలియదని పారికర్‌ చెప్పారంటూ.. మరి ఆయన  గోవా ఫిష్‌ మార్కెట్‌లో  చేపలు కొంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

రాఫెల్‌ స్కాంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలు అప్పటి దేశ రక్షణ శాఖ మంత్రి పారికర్‌కి తెలియదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఈ కుంభకోణంలో అన్న విషయాలు తెలుసని ఆయన ఆరోపించారు. ఒప్పంద సమయంలో కార్యదర్శులు, మంత్రులు ఎవరూ లేరనీ, అనిల్ అంబానీ మాత్రమే ఉన్నారని తెలిపారు. తనకు కావాల్సిన వారికి బెనిఫిట్ చేయటం కూడా అవినీతే అని జైపాల్ రెడ్డి విమర్శించారు.

నా ప్రకటనకు కట్టుబడి ఉన్నా: హోలెండ్‌
రాఫెల్‌ ఒప్పందం విషయంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హలెండ్‌ ప్రకటించారు. రాఫెల్‌ ఒప్పందంలో రిలయన్స్‌ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని, అందువల్లే గత్యంతరం లేక తాము ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని హోలెండ్‌ స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement
Advertisement