విలీనంపై కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ చర్చలు | Sakshi
Sakshi News home page

విలీనంపై కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ చర్చలు

Published Mon, Feb 10 2014 2:45 AM

విలీనంపై కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ చర్చలు - Sakshi

 తెలంగాణ ముఖ్యమంత్రి పదవి మాకే కావాలి: కేసీఆర్ ప్రతిపాదన
 కేసీఆర్‌ను ‘పునర్నిర్మాణ మండలి’ చైర్మన్‌ను చేస్తాం: కాంగ్రెస్ సూచన
 రాష్ట్రంలో సీట్లలోనూ సగం వాటా కోరుతున్న టీఆర్‌ఎస్ అధినేత
 
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరనున్న తరుణంలో.. కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అంశంపై చర్చోపచర్చలు, వాదోపవాదాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు ఉభయసభల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరగాల్సిన పరిణామాలపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అధినాయకత్వాలు కసరత్తు ప్రారంభించాయి. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి అటు, ఇటుగా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందేనని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ద్వారా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు శనివారం సాయంత్రమే సూచనలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ సూచనను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కూడా అంగీకారం తెలిపినట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి రెండు పార్టీల నుంచీ పలు ప్రతిపాదనలు, ప్రతివాదనలపై చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
 
  ముఖ్యంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాము సూచించిన వారికే ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు పట్టుపడుతుంటే.. అది సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నట్లు తెలిసింది. దానికి బదులుగా.. కేసీఆర్‌కు తెలంగాణ పునర్నిర్మాణ మండలిని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్‌ను చైర్మన్‌గా నియమిస్తామని.. ఆ పదవికి సీఎం హోదాతో సమాన హోదాను కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్తున్నారు. అగ్రనేతల స్థాయిలో ఈ చర్చలు సాగుతుండగా.. ఇటు కాంగ్రెస్ తెలంగాణ నేతలు, అటు టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం విలీనం వద్దని ఎవరికి వారుగానే గట్టిగా కోరుకుంటున్నారు. విలీనం లేకుండానే కాంగ్రెస్ గెలుస్తుందని ఒకరు ధీమాగా ఉంటే.. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండానే టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని మరొకరు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో విలీనం కాకపోతే తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆగిపోయే ప్రమాదం ఉందని కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలకు చెప్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య నిర్దుష్టమైన అంశాలపై ఒప్పందం కుదురుతుందని, అప్పటిదాకా అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు టీఆర్‌ఎస్‌లోనూ అంతర్గత చర్చలే ఉంటాయని ఇరు పార్టీల ముఖ్యులు చెప్తున్నారు. విలీనమైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పదవులు, రాజ్యసభ సీట్లతో పాటు లోక్‌సభ, శాసనసభ్యుల్లో పంపకాలకు సంబంధించిన అంశాలపై బిల్లు ఆమోదం పొందేలోగా ఇరు పార్టీలూ ప్రాథమిక అవగాహనకు రావాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
 
 ‘విలీనం లేదంటే బిల్లు ఆగుతుంది’
 ‘విలీనం చేయకుంటే లోక్‌సభలో కాంగ్రెస్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? కాంగ్రెస్ కష్టపడకుంటే లోక్‌సభలో బిల్లు ఆగిపోతుంది. తెలంగాణ రాకుంటే మనం విలీనం చేయకపోవటమే కారణమనే ప్రచారం చేస్తే ఎదుర్కోగలమా? ఇక్కడిదాకా తెలంగాణను తీసుకొచ్చి ఆమోదం చేయించుకోకుంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
 
 ఇప్పుడు నిరసనలు వద్దని టీ-జేఏసీ నేతలకు సూచన
 పోలవరం ముంపు కోసం భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని గ్రామాలను సీమాంధ్రలో కలపడం, ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన స్థానికత, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో వంటి అంశాలపై కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లులో తెలంగాణకు నష్టం చేసే అంశాలున్నాయని తెలంగాణ జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్లమెంటులో బిల్లు చర్చలోనైనా వాటిని సవరించాలనే డిమాండుతో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం నుండి దీక్షకు దిగాలని తెలంగాణ జేఏసీ ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే.. ఇప్పుడు ఇలాంటి నిరసనలు చేయకపోవడమే మంచిదని తెలంగాణ జేఏసీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. తెలంగాణ బిల్లును అటు సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తుంటే తెలంగాణ నేతలు కూడా వ్యతిరేకించటం మంచిది కాదని ఢిల్లీలోని నివాసంలో తనను కలసిన జేఏసీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
 
 లోక్‌సభలో ఆమోదంపై దిగ్విజయ్ సందేహం?
 తెలంగాణ బిల్లు సోమవారం లేదా మంగళవారం రాజ్యసభకు వస్తుందని.. స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఆ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ కేసీఆర్‌కు చెప్పినట్లు సమాచారం. టీ-బిల్లును ముందుగా రాజ్యసభలోనే పెడుతున్నామని, దానికి టీఆర్‌ఎస్ తరఫున అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్‌కు దిగ్విజయ్ వివరించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీతో పాటు మిగిలిన పార్టీలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే లోక్‌సభలో బిల్లు రావటం సాధ్యం కాదేమోనని దిగ్విజయ్ సందేహం వ్యక్తం చేసినట్లు టీఆర్‌ఎస్ ముఖ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘రాజ్యసభలోనే బిల్లు ఆమోదం పొందుతుంది. ఎన్నికల తర్వాత వచ్చే కేంద్ర ప్రభుత్వం మొదటి సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లును పూర్తిచేసుకుందాం. వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయవచ్చు కదా? రాజ్యసభలో బిల్లును పూర్తిచేసిన తర్వాత కలసి పనిచేయటానికి అభ్యంతరం ఏమిటి?’ అని కేసీఆర్‌ను దిగ్విజయ్ ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే.. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందేదాకా ఎన్నికల అంశాన్ని తెరపైకి తేలేమని, వాటిపై మాట్లాడుకోలేమని కేసీఆర్ వివరించినట్లు టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
 
 సమాన భాగస్వామ్యం
 కావాలి: టీఆర్‌ఎస్
 కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయటానికి టీఆర్‌ఎస్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్లుగా ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటే టీఆర్‌ఎస్‌పై కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటికోసం అధికారంలో సమాన భాగస్వామ్యం కావాలని కోరుతున్నట్టుగా తెలిసింది. టీఆర్‌ఎస్ ముఖ్య ప్రతిపాదనలు ఇవీ...
     తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని టీఆర్‌ఎస్ సూచించిన నాయకునికే ఇవ్వాలి.
     తెలంగాణ రాష్ట్రంలోని లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు సగం వాటా ఇవ్వాలి.
     వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలి.
     తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలి.
 
 బేషరతుగా విలీనం చేయాలి: కాంగ్రెస్
 టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పలు సామాజికవర్గాల నుంచి బలమైన నాయకత్వం ఉందని, విలీనమైన వెంటనే టీఆర్‌ఎస్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేస్తే పలు రాజకీయ, సామాజిక సమస్యలు తలెత్తుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి...
 
     టీఆర్‌ఎస్ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. 17 ఎంపీ సీట్లున్న తెలంగాణ కోసం 25 ఎంపీ సీట్లను వదులుకునేందుకు సిద్ధమయ్యాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నందున షరతుల్లేకుండా టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలి.
     రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేసీఆర్ స్వచ్ఛందంగా విలీన ప్రకటన చేయాలి. గతంలో పీఆర్పీ అధినేత చిరంజీవి ఇదే విధమైన ప్రకటన చేసినందుకు ప్రతిఫలంగా ఆయనకు కేంద్రమంత్రి పదవి, ఆయన సూచించిన వారికి రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చాం.
 
     విలీనం అనంతరం ‘తెలంగాణ పునర్నిర్మాణ (అభివృద్ధి) మండలి’ని ఏర్పాటుచేసి కేసీఆర్‌ను చైర్మన్‌గా చేస్తాం. కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసినందున అవసరమైతే ఆ పదవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాన హోదా కల్పిస్తాం. యూపీఏ చైర్‌పర్సన్ హోదాలో సోనియాగాంధీకి కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగ స్వామిని చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాలు, కార్యక్రమాల అమలులో కేసీఆర్‌కు భాగస్వామ్యం కల్పిస్తాం.
 
     వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో కేసీఆర్ సూచించిన వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికల సీట్ల విషయంలోనూ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాం.
 
 టీఆర్‌ఎస్ రాకున్నా నష్టం లేదు: టీ-కాంగ్రెస్ నేతలు
 కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనానికి ఎలాంటి ప్రతిపాదనలకూ అంగీకరించాల్సిన అవసరమే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తెలంగాణ కోసం ప్రజలు, పార్టీ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది తామేనని చెప్తున్నారు. వారు ఏమంటున్నారంటే...
 
  కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు కోల్పోతున్నదేముంది? తెలంగాణ ఏర్పాటుతో పాటు అధికారంలో భాగస్వాములు కావటం తప్ప. అలాంటప్పుడు విలీనానికి టీఆర్‌ఎస్ పెట్టే షరతులకు ఎందుకు అంగీకరించాలి?
 తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్‌ఎస్‌కు ఎజెండా ఏముంది? ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకు వెళతారు? విలీనమైతే వారికే మంచిది. లేదంటే కాంగ్రెస్‌కొచ్చిన నష్టమేమీ లేదు.
 
  తెలంగాణ కోసం పోరాడిన పార్టీ టీఆర్‌ఎస్సే అయినప్పటికీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సే. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీని దేవతలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌నే ఎక్కువగా ఆదరిస్తారే తప్ప కేసీఆర్‌ను కాదు.
 
  టీఆర్‌ఎస్ విలీనమైతే తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. విలీనం కాకపోతే మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వస్తుంది.
 
  టీఆర్‌ఎస్ విలీనం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగే అవకాశముంది. సగం స్థానాలను టీఆర్‌ఎస్ నేతలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని బతుకున్న కాంగ్రెస్ నేతలు ఆ మేరకు నష్టపోతారు.
 
  పీఆర్పీ మాదిరిగా బేషరతుగా విలీనం చేస్తే సరి.. లేదంటే కేసీఆర్‌కే నష్టం. అంతేతప్ప ఆయన మాటలు, ప్రతిపాదనలను నమ్మి హైకమాండ్ మోసపోకూడదు. తెలంగాణ కోసం సీమాంధ్రలో పార్టీని దూరం చేసుకున్నాం. కేసీఆర్ షరతుల తో తెలంగాణలోనూ నష్టాన్ని కొనితెచ్చుకోవద్దు.
 
 స్వతంత్ర పోటీయే మేలు: టీఆర్‌ఎస్ నేతలు
 తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కోరుతోంది. 13 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో త్యాగాలకు, వ్యయప్రయాలకు ఓర్చి ఉద్యమించామని, ఇప్పుడైనా రాజకీయ అవకాశం రావాలంటే టీఆర్‌ఎస్ పార్టీ ఉండాల్సిందేనని వారు కోరుతున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌కే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వస్తుందని వాదిస్తున్నారు.
 
  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే అధికారం వస్తుంది.
  తెలంగాణలో కేసీఆర్‌కు ఉన్న వాక్పటిమ, చాతుర్యం, ఆదరణకు పోటీగా కాంగ్రెస్‌లో కూడా ఎవరూ లేరు.
  కేసీఆర్ ఒక్కడే నాయకుడు అయితే కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూపులు కొట్టుకుంటాయి.
  పొత్తులకు సీపీఐ వంటి నిర్మాణం ఉన్న పార్టీలతో అవకాశం కూడా ఉంది.
  పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. విలీనమైతే ఆ ప్రభావం బాగా ఉంటుంది. అలాంటప్పుడు విలీనం, పొత్తు వంటి అంశాలకు తావులేకుండా స్వతంత్రంగా పోటీ చేయటమే మేలు.
 
  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కోసం టీఆర్‌ఎస్ నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో దశాబ్ద కాలంగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. విలీనం చేస్తే వారంతా మరోసారి నష్టపోతారు. చిరంజీవి మాదిరిగా కేసీఆర్‌కు ఈ విషయంలో అపవాదు వచ్చే ప్రమాదముంది.
 

Advertisement
Advertisement