కాంగ్రెస్ ఎన్నికల తాజా షెడ్యూల్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎన్నికల తాజా షెడ్యూల్

Published Fri, Mar 27 2015 12:45 AM

కాంగ్రెస్ ఎన్నికల తాజా షెడ్యూల్ - Sakshi

సభ్యత్వ నమోదు మే 15 వరకు పొడిగింపు
సెప్టెంబర్ 30న అధ్యక్ష పదవికి ఎన్నిక
ఏపీ, తెలంగాణలో జూలై 28 నుంచి ప్రారంభం

 
న్యూఢిల్లీ: పార్టీ సంస్థాగత ఎన్నికల తాజా షెడ్యూల్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. బూత్ స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష స్థాయి వరకు జరిగే ఈ ఎన్నికలు.. జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ 30న పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికతో ముగుస్తాయి. ఈ కొత్త షెడ్యూల్‌లో సభ్యత్వ నమోదు గడవును మార్చి 31 నుంచి మే 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు విడతల్లో జరపాలని నిర్ణయించడం ఈ ఎన్నికల ప్రత్యేకత. మొదటి విడతలో గుజరాత్, హర్యానా, కేరళ సహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. రెండో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక సహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ముళ్లపల్లి రామచంద్రన్ నేతృత్వంలోని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ నిర్ణయించింది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ గురువారం మీడియాకు తెలిపారు. ఈసారి పార్టీ పగ్గాలు ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగించనున్నారన్న వార్తల నేపథ్యంలో పార్టీ ఎన్నికలు జరగనుండటం విశేషం. 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియాగాంధీ 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి, పార్టీ చరిత్రలోనే అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన రికార్డు సృష్టించారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు రెండో దశలో ఎన్నికల షెడ్యూల్

మే 15: సంస్థాగత ఎన్నికల సభ్యత్వ రుసుము రూ. 5 చెల్లించేందుకు చివరి తేదీ.
మే 30: మే 15 వరకు వచ్చిన సభ్యత్వాలతో కూడిన ప్రాథమిక జాబితాను, ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హత కలిగిన సభ్యుల జాబితాను జిల్లా కాంగ్రెస్ కమిటీలు ప్రకటించే తేదీ.
జూన్ 10: జాబితాలో తప్పుల సవరణకు, అభ్యర్థనలకు చివరి గడువు.
జూలై 6: పీసీసీకి, కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పీల్ చేసుకునేందుకు చివరి తేదీ.
జూలై 24: డీసీసీలు తుది జాబితా విడుదల.
జూలై 28 నుంచి ఆగస్టు 14 వరకు: బూత్ స్థాయి కమిటీ అధ్యక్షుడిని, కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు  జరుగుతాయి.
ఆగస్ట్ 20 నుంచి 31 వరకు: బ్లాక్ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కార్యవర్గం ఎన్నిక.
సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు: డీసీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యవర్గ కమిటీ ఎన్నిక.
సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు: పీసీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి, కార్యవర్గ కమిటీ ఎన్నిక. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్ష స్థానానికి ఎన్నిక జరుగుతుంది. చివరగా ఏఐసీసీ ప్లీనరీలో ఏఐసీసీ సభ్యులు కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు.
 
 ఆమె చుట్టూ భజనపరులు! సోనియాపై హన్స్‌రాజ్ ధ్వజం


న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎలాంటి బాధ్యత పంచుకోవడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత హన్స్‌రాజ్ భరద్వాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె కొంతమంది భజనపరులు, అవినీతిపరుల గుప్పిట్లో చిక్కుకుపోయారని ఆరోపించారు. ‘మా నాయకులకు కోర్టుల నుంచి సమన్లు అందుతున్నాయి. అదీ ప్రధానమంత్రి స్థాయి పదవుల్లో పనిచేసిన వారికి కూడా సమన్లు రావడం అత్యంత బాధాకరం. ఏం జరిగిందో సోనియాకి తెలియదా?.. అన్నీ తెలుసు. అదే ఆమె పద్ధతి. అన్నీ చేయడం.. ఏ బాధ్యతను పంచుకోకపోవడం.. అదే ఆమె విధానం’ అంటూ ఒక ఆంగ్ల వార్తాచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగారు.
 

Advertisement
Advertisement