సంప్రదాయ వైద్యం నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

సంప్రదాయ వైద్యం నిర్లక్ష్యం

Published Thu, May 4 2017 1:56 AM

సంప్రదాయ వైద్యం నిర్లక్ష్యం - Sakshi

గత ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శ
- ఆయుర్వేద మందులకు కొత్త ప్యాకింగ్‌తో ఆదరణ లభిస్తుందని వెల్లడి
- పతంజలి యోగ్‌ పీఠ్‌లో ఆధునిక పరిశోధన కేంద్రం ప్రారంభం
- మోదీకి ‘రాష్ట్ర రుషి’ బిరుదు ప్రదానం


హరిద్వార్‌: ఆయుర్వేదం వంటి సంప్రదాయ భారత వైద్య విధానాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సంప్రదాయ వైద్య వ్యవస్థ లను, యోగా వంటి ఆరోగ్య విధానాలను ప్రోత్సహించడానికి స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తగినంత కృషి జరగలేదన్నారు. ఆయన బుధవారమిక్కడ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి యోగ్‌ పీఠ్‌లో అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ‘స్వాతంత్య్రానికి పూర్వం మనది బానిస దేశం కనుక మన సంప్రదాయ వైద్య, ఆరోగ్య వ్యవస్థలను మరుగుపరచారు. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం తర్వాతా ప్రభుత్వాలు వీటి విశిష్టతలను విస్మరించా యి’ అని అన్నారు.

ఆయుర్వేద ఔషధాలకు ఆధునిక ప్యాకింగ్, క్లినికల్‌ పరీక్షల కోసం యోగ్‌పీఠ్‌లో కొత్త సంస్థను ఏర్పాటు చేశారని, ఉత్తమ ఆరోగ్యసంరక్షణ దిశగా ఇది ఒక ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో ఆధునిక లేబొరేటరీ ఉందని, భారత సంప్రదాయ చికిత్సా విధానాలకు దీనిద్వారా విస్తృత ఆమోదం లభిస్తుందన్నారు. పాత పద్ధతుల వల్ల ఆయుర్వేద మందులకు ఆద రణ లభించడం లేదని, వాటిని కొత్త పద్ధతు ల్లో ప్యాక్‌ చేస్తే ప్రపంచం సంతోషంగా స్వీకరి స్తుందన్నారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు, యోగాను ప్రపంచం లోని ప్రతి ఇంటికి చేరువ చేసినందుకు రాందేవ్‌ను అభినందిస్తు న్నానని అన్నారు.

రాందేవ్‌ సహాయకుడు ఆచార్య బాలకృష్ణ రూపొందిం చిన ‘వరల్డ్‌ హెర్బ్‌ ఎన్‌సైక్లోపీడియా’ను ప్రధాని ఆవిష్కరించారు. దేశంలో లభించే 70వేల మూలికల వివరాలు ఇందులో ఉన్నాయి. కార్యక్రమంలో రాందేవ్‌.. మోదీకి ‘రాష్ట్ర రుషి’ బిరుదును ప్రదానం చేశారు. పరిశుభ్రమైన, శక్తిమంతమైన, సమైక్య భారత నిర్మాణానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నందుకు ఈ బిరుదు ఇచ్చామని, ఆదర్శవంతమైన ఆయన నాయ కత్వంలో దేశం సుసంపన్నమవుతుందని రాందేవ్‌ కొనియాడారు. ఈ గౌరవం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మోదీ అన్నారు. ‘ఈ దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నాకు స్ఫూర్తి. వారి ఆశీర్వాద బలంపై ఉన్నంత నమ్మకం నాపైన నాకు లేదు’ అని అన్నారు.

తానే బూట్లు విప్పుకుని..
వీఐపీ సంస్కృతి పోవాలని ఇటీవల చెప్పిన మోదీ కేదార్‌నాథ్‌ ఆలయంలో దాన్ని ఆచరించి చూపారు. ఆయన గుడి లోకి వెళ్లే ముందు ఒకచోట కూర్చుని తన బూట్లను తానే విప్పుకున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి సాయం చేస్తానని ముందుకురాగా, ప్రధాని సున్నితంగా వద్దని తిరస్కరించారు.

మీడియాకు బలమైన మద్దతు
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మీడియాకు బలమైన మద్దతు ప్రకటిం చారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన మీడియా స్వేచ్ఛగా, శక్తిమంతంగా ఉండేందుకు మన బలమైన మద్దతును ఈ రోజు పునరుద్ఘాటించాలని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా క్రియాశీలక మాధ్యమంగా మారి, పత్రికాస్వేచ్ఛకు శక్తినిస్తోందని పేర్కొన్నారు.

కేదార్‌నాథ్‌లో మోదీ పూజలు
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ బుధవారం పూజలు నిర్వహించారు. హిమాలయాల్లోని ఈ గుడిని శీతాకాల విరామం తర్వాత బుధవారమే తెరవగా మోదీ తొలిభక్తుడిగా శివుణ్ని సేవించారు. గత 28 ఏళ్లలో దేశ ప్రధాని ఒకరు ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. రాష్ట్ర గవర్నర్‌ కే.కే. పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌తో కలసి వచ్చిన మోదీ కేదారేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించారు. పూజారులు ఆయనకు ఒక శాలువా, రుద్రాక్ష తదితరాలను కానుకగా సమర్పించారు. గుడి బయటికి వచ్చిన ప్రధాని ప్రజలకు నవ్వుతూ అభివాదం చేశారు.

తొలిరోజు ఆలయాన్ని సందర్శించిన 4 వేల మంది భక్తులు ప్రధానిని చూసేందుకూ ఉత్సాహం ప్రదర్శించారు.2013నాటి వరదల్లో కొండలపైనుంచి దొర్లిపడి గుడివెనక నిలిచిపోయిన ‘భీమ్‌శిల’ను కూడా ప్రధాని దర్శించారు. ఈ శిల ఆలయానికి నష్టం కలగకుండా కాపాడిందని ప్రతీతి. గుడిలో గంటసేపున్న ప్రధాని హెలిప్యాడ్‌ వద్దకు తిరిగి వెళ్తూ మధ్యలో ఓ సైనికుడి చేతిలోని చిన్నారిని భుజం తట్టారు. వారిద్దరితో కాసేపు ముచ్చటించారు.  కేదార్‌నాథ్‌పర్యటన తర్వాత మోదీ హరిద్వార్‌కు వెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement