లోక్‌సభకు ఆర్డినెన్స్‌ల కాపీలు | Sakshi
Sakshi News home page

లోక్‌సభకు ఆర్డినెన్స్‌ల కాపీలు

Published Tue, Feb 24 2015 3:01 AM

లోక్‌సభకు ఆర్డినెన్స్‌ల కాపీలు

న్యూఢిల్లీ: భూసేకరణ చట్ట సవరణతో పలు అంశాలపై ఇటీవల జారీ చేసిన ఆరు ఆర్డినెన్స్ కాపీలను విపక్షాల నిరసనల మధ్య కేంద్రం సోమవారం లోక్‌సభ ముందుంచింది వచ్చే నెల 20తో ఈ ఆర్డినెన్స్‌ల గడువు ముగిసిపోతుండడంతో... ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే వాటికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో భూసేకరణ సవరణతో పాటు బొగ్గు గనులు, ఈ-రిక్షాలు, బీమా రంగంలో ఎఫ్‌డీఐలు, పౌరసత్వ చట్ట సవరణ, గనులు-ఖనిజాలు తదితలపై జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ సభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో తృణమూల్, ఇతర విపక్షాల సభ్యులు లేచి ‘ఆర్డినెన్స్ రాజ్’కు ప్రభుత్వం ముగింపు పలకాలని నినాదాలు చేశారు. కాగా భూసేకరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
 
 రాజకీయం చేయొద్దు.. వెంకయ్య: కాగా ఆర్డినెన్స్‌లపై పూర్తిస్థాయిలో చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దీనిపై రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు సూచించారు. అన్ని పార్టీలూ అర్థం చేసుకుని, సహకరిస్తాయని భావిస్తున్నానన్నారు.కొత్త భూసేకరణ చట్టం దేశవ్యాప్తంగా రైతులకు మరిన్ని ప్రయోజనాలను కల్పిస్తుందని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
 
 అన్ని అంశాలపై చర్చిస్తాం. పార్లమెంటులో దేశ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని, విపక్షాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పరస్పర సహకారంతో మంచి వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజల ఆశలను తీర్చేలా బడ్జెట్ ఉంటుందని పార్లమెంటు వద్ద మీడియాతో అన్నారు.
 
 సౌదీ రాజు మృతిపట్ల సంతాపం..ఇటీవల మరణించిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా అజీజ్ అల్‌సౌద్, కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్‌లకు పార్లమెంటు ఉభయసభలు సోమవారం నివాళి అర్పించాయి.  మాజీ ఎంపీలు సభ్యులు జి.వెంకటస్వామి, డి.రామానాయుడు, మరికొందరు సభ్యులకూ నివాళులు సమర్పించాయి. బోడోల హింసలో మృతి చెందిన 80 మంది కుటుంబాలకు ఎంపీలు సానుభూతి తెలిపారు.
 
 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ నెలాఖరులోనే ముగియనుంది. కానీ జమ్మూకశ్మీర్ నుంచి ఈ నెల తొలివారంలో ఆయన తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆజాద్ రాజ్యసభకు ఎంపీకావడం ఇది ఐదోసారి. అనంతరం ఆజాద్‌ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ.. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement