రేప్ బాధితురాలికి నరకం చూపించిన ఖాకీలు | Sakshi
Sakshi News home page

రేప్ బాధితురాలికి నరకం చూపించిన ఖాకీలు

Published Fri, Nov 4 2016 8:19 AM

రేప్ బాధితురాలికి నరకం చూపించిన ఖాకీలు

తిరువనంతపురం: 'నేను మళ్లీ పోలీసు కేసు పెట్టాలనుకోవడం లేదు. నాపై జరిగిన అత్యాచారం కంటే పోలీసుల వేధింపులే దారుణంగా ఉన్నాయి. పోలీసుల బెదిరింపులు, వేధింపులు తట్టులేకోపోతున్నాం'.. ఇదీ కేరళలో సామూహిక అత్యారానికి గురైన 35 ఏళ్ల మహిళ ఆవేదన. న్యాయం కోసం తమను ఆశ్రయించిన అత్యాచార బాధితురాలికి కేరళ పోలీసులు మూడు నెలల పాటు నరకం చూపించారు. పిచ్చి ‍ప్రశ్నలతో ఆమెను వేధించి, ఒత్తిడి పెంచి కేసు ఉపసంహరించుకునేలా చేశారు.

ఈ అభాగ్యురాలి కన్నీటి గాథను ప్రముఖ డబ్బింగ్ కళాకారిణి భాగ్యలక్ష్మి ఫేస్ బుక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో త్రిశూర్ లో బాధితురాలిపై ఆమె భర్త స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆస్పత్రిలో ఉన్నాడని నమ్మబలికి ఇంట్లోంచి ఆమెను బయటకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. నలుగురు నిందితుల్లో ఒకరు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు భాగ్యలక్ష్మి వెల్లడించారు. భర్తతో కలిసి బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాధితురాలు కేసు వెనక్కి తీసుకుంది.

ఫేస్ బుక్ లో పెట్టిన భాగ్యలక్ష్మి పోస్టు విపరీతంగా షేర్ కావడంతో విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం కార్యాలయం హామీయిచ్చింది. కాగా, బాధితురాలు, ఆమె భర్త ముసుగులు ధరించి గురువారం మీడియా ముందుకు వచ్చారు. పోలీసులు తమను ఏవిధంగా వేధించారో వివరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement