అక్కడి నుంచే భారత్‌లోకి కరోనా

10 Jun, 2020 07:59 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కరోనా మన దేశానికి యూరప్, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చి ఉంటుందని బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 294 కరోనా వైరస్‌ జన్యుక్రమాలపై కుమార్‌ సోమసుందరం, మైనక్‌ మండల్, అంకిత లావార్డ్‌లతో కూడిన ఐఐఎస్‌సీ బృందం చేసిన అధ్యయనం గుర్తించిన విషయాల్లో ఇది ఒక అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్స్‌–కోవిడ్‌–2 వైరస్‌కీ, భారతదేశంలోని వైరస్‌కీ మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలను నిర్ధారించడంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌తో ఎక్కువ రాకపోకలు జరిగే, కోవిడ్‌ విస్త్రుతంగా వ్యాప్తి చెందిన దేశాలైన యూరప్, తూర్పు మధ్య ఒషియేనా, దక్షిణ ఆసియా ప్రాంతాల నుంచి మన దేశంలోకి ఈ వైరస్‌ వచ్చి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. (చైనాలో ఆగ‌స్టులోనే క‌రోనా విజృంభణ!)


ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు పీపీఈ కిట్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దళంలోని ప్రతి సభ్యుడికి ఐదేసి పీపీఈ కిట్లు అందజేస్తామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌.ఎన్‌. ప్రధాన్‌ తెలిపారు. వీటిలో రెండు కోవిడ్‌కు, మిగతా మూడు ఎండ, ఇతర కలుషితాలు సోకకుండా రక్షణ కల్పించేవన్నారు. రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొనే బృంద సభ్యులకు పీపీఈ కిట్లు, హైడ్రో క్లోరోక్విన్‌ మాత్రలు అందించడంతోపాటు వ్యాధినిరోధక శక్తి పెంపునకు ఆయుష్‌ శాఖ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల సంభవించిన అంఫన్‌ తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో 51మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. వీరిలో ఎవరికీ కోవిడ్‌ లక్షణాలు లేనందున, మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.

15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల ప్రభావం అధికంగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర బృందాలను పంపింది. అత్యధిక కేసులు ఉన్న ప్రాంతాలు, అధికంగా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా హైలెవల్‌ మల్టీ డిసిప్లినరీ సెంట్రల్‌ టీమ్స్‌ పనిచేస్తాయి. తెలంగాణకు నాలుగు, మహారాష్ట్రకు 7, తమిళనాడుకు 7, రాజస్తాన్‌కు 5, అసోంకు 6, హరియాణాకు 4, గుజరాత్‌కు 3, కర్ణాటకకు 4, ఉత్తరాఖండ్‌కు 3, మధ్యప్రదేశ్‌కు 5, పశ్చిమబెంగాల్‌కు 3, ఢిల్లీకి 3, బిహార్‌కు 4, యూపీకి 4, ఒడిశాకు 5 బృందాలను పంపినట్టు తెలిపింది. ప్రతీ త్రిసభ్య బృందంలో ఇద్దరు ఆరోగ్య నిపుణులు, ఒక సీనియర్‌ సంయుక్త కార్యదర్శి స్థాయి నోడల్‌ అధికారి ఉంటారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు