కొత్తగా 38,902 కేసులు, 543 మంది మృతి | Sakshi
Sakshi News home page

కరోనా భారత్‌: 38,902 కేసులు, 543 మంది మృతి

Published Sun, Jul 19 2020 9:57 AM

Coronavirus 38902 Positive Cases Reported Across India - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మిలియన్‌ మార్చ్‌ పూర్తి చేసిన కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. దాంతోపాటు కొత్తగా 543 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 62.86 గా ఉంది. 3,73,379 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, ఒకరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
(చదవండి: సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ)

ఇదిలాఉండగా.. కరోనా బాధితుల రికవరీలో ఢిల్లీ రాష్ట్రం ముందంజలో ఉంది. అక్కడ వైరస్‌ నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు 83.29 గా ఉండటం విశేషం. ఇక దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదులో కూడా తగ్గుదల నమోదవుతుండటం శుభపరిణామం. ఢిల్లీలో ప్రస్తుతం 16,711 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మూడు లక్షల కేసులతో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) చెప్తుండగా.. అలాంటిదేమీ లేదని కేంద్రం వాదిస్తుండటం గమనార్హం.
(కరోనా భయం.. మూడు రోజులు గడిచినా!)

Advertisement

తప్పక చదవండి

Advertisement