నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది! | Sakshi
Sakshi News home page

నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది!

Published Mon, Apr 20 2020 3:50 PM

Coronavirus Hygiene Architectural Designs In Ancient India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవడం’ అతి ముఖ్యమైనదిగా నేడు వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లోకి రావడంతోనే కాళ్లు చేతులు కడుక్కోవడం, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా అదే పద్ధతి పాటించడం దాదాపు అన్ని దేశాల్లో కొనసాగిన ప్రాచీన సంప్రదాయం. ఈ సంప్రదాయం భారత్‌ సహ కొన్ని దేశాల్లో నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆధునిక పోకడలు సంతరించుకున్న పట్టణ ప్రాంత భవనాలు, భవన సముదాయాల్లో ఈ సంప్రదాయం మచ్చుకైనా కనిపించదు. 

ప్రాచీనకాలంకన్నా ఇప్పుడు ప్రతి ఇంటికి బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్‌లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవి ఇంటి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. పైగా అవి ఇంటి ముందు ఉండవు కనుక ఇంటి వారు కూడా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం కోసం ఇంటి లోపలి బాత్‌రూమ్‌ల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారులు మానవాళిపై దండయాత్ర చేసినప్పుడు బాత్‌రూమ్‌లు ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 
(చదవండి: కరోనాతో గ్లోబల్‌ ట్రేడ్‌కు భారీ షాక్‌..)

ప్రాచీన కాలంలో ఇంటివారు లేదా అతిథులు బయట నుంచి రాగానే ఇంటి ముందే కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బకెట్లో లేదా గంగాళంలో నీరు నింపి పెట్టేవారు. నీళ్లు ముంచుకోవడానికి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే లక్షణాలు కలిగిన రాగి చెంబును ఉంచేవారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో ఇంటి ముందు లేదా ఇంటి వసారా లేదా ప్రాంగణంలో లేదా గచ్చులో ఈ కాళ్లు, చేతులు కడుక్కునే ఏర్పాటు ఉండేది. పెద్ద పెద్ద ఇళ్లు, భవనాల్లో వసారా లేదా ప్రాంగణంలో ఈ వసతి ఉంటే చిన్న ఇళ్లలో ‘గచ్చు’ల వద్ద ఉండేవి. చతురస్రాకారంలో ఉండే గచ్చుపైన ఇంటి పైకప్పు ఓపెన్‌గా ఉంటుంది. వసారా లేదా గచ్చులోకి గాలి, వెలుతురు, ఎండ బాగా వచ్చే వెసులుబాటు ఉండడం వల్ల వైరస్‌ల బారిన పడే అవకాశం తక్కువగా ఉండేది. 
(చదవండి: భారత్‌ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి)

బీజింగ్‌లో ప్రాంగణం లేదా గచ్చులను ‘ఉటాంగ్స్‌’ అని, దక్షిణాఫ్రికాలో ‘లాపా’ అని. లాటిన్‌లో పాశియో అని పిలుస్తారు. కొన్ని దేశాల్లో ఈ ప్రాంగణాల్లో ఔషధ మొక్కలను పెంచేవారు. ఈ ప్రాంగణాలు పిల్లలు ఆడుకోవడానికి వీలుగానే కాకుండా జబ్బు పడిన వారు ఏకాంతవాసం గడిపేందుకు ఆస్కారమూ ఉండేది. చారిత్రక కట్టడాల విషయం ఏమోగానీ ప్రార్థనా మందిరాల వద్ద కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ప్రాంగణంలో కుళాయిలు ఉండడం నేటికి కనిపిస్తుంది. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేయడానికి ముందు పాదాలు, మోచేతుల నుంచి ముఖం వరకు కడుక్కునే మంచి సంప్రదాయం ఉంది. దీన్ని ‘వుదు’ అని అంటారు. అయితే ఒక్క హౌజ్‌లో నిల్వ చేసిన నీటిని అందరూ నేరుగా చేతులతోని తీసుకొని కడుక్కోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరగుతోంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‌లు ఇలా ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. 
(చదవండి: కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!)

Advertisement
Advertisement