కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్‌! | Sakshi
Sakshi News home page

కరోనా: రైళ్లు రద్దు.. డబ్బు వాపస్‌!

Published Sat, Mar 21 2020 2:37 PM

Coronavirus Indian Railways Said Refund For All Passengers Train Ticket - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) సోకినవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేస్తూ గుంపులు గుంపులుగా తిరగకుండా, సామాజిక దూరం పాటించే విధంగా భారత రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికులు బుక్‌ చేసుకున్న రైలు టికెట్ల డబ్బును 100 శాతం ప్రయాణికులకు రీఫండ్‌ చేయనున్నట్లు ఇండియన్‌ రైల్వే ప్రకటించింది. ఇక భారత రైల్వే పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ ఇచ్చే టికెట్ల నిబంధనలను సడలించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి ఆయా వ్యాలెట్లు, అకౌంట్లలో డబ్బు రీఫండ్‌ అవుతుందని ఇండియన్‌ రైల్వే తెలిపింది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా)

ఈ- టికెట్ కోసం అన్ని నియమాలు ఒకే విధంగా ఉంటాయని, ప్రయాణికులు టికెట్ వాపసు కోసం స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ పరిధిలోని సబ్ అర్బన్ సర్వీసులు (లోకల్ ట్రైన్స్) సంఖ్యను కూడా తగ్గించనున్నారు. చాలా తక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రద్దు చేసిన మొత్తం రైళ్ల సంఖ్య 245కి చేరింది. (యూపీ సీఎం కీలక నిర్ణయం, 35లక్షల మందికి లబ్ధి)
చదవండి: భారత్‌లో 271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

Advertisement
Advertisement