దగ్గు మందు తాగి 9మంది మృతి | Sakshi
Sakshi News home page

దగ్గు మందు తాగి 9మంది చిన్నారులు మృతి

Published Fri, Feb 21 2020 10:24 AM

Cough Syrup Coldbest PC Recalled Production Halted After 9 Deaths In Jammu - Sakshi

సాక్షి, శ్రీనగర్‌: ఫార్మాసుటికల్‌ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్‌ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్‌ కాంపౌండ్‌ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు.

గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్‌లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్‌ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్‌, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement