గెలుపు కోసం ‘షా’న్‌దార్ వ్యూహాలు | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం ‘షా’న్‌దార్ వ్యూహాలు

Published Wed, Aug 6 2014 2:12 AM

గెలుపు కోసం ‘షా’న్‌దార్ వ్యూహాలు - Sakshi

 ముంబై: రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయం దక్కేలా వ్యూహాలు రూపొందించిన అమిత్ షా ఇప్పుడు మహారాష్ట్రంలో మహాకూటమికి అధికారం దక్కేలా పథకరచన చేస్తున్నారు. అమిత్ షా మార్గదర్శకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో షా వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని, అయితే మహారాష్ట్రంలో మాత్రం యూపీ ఫార్ములాను అమలు చేయబోమని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర కోసం మహా ఫార్ములాను షా రూపొందిస్తున్నారని, ఇప్పటికే ఫార్ములాను అమలు చేయడం ప్రారంభించామన్నారు. అయితే షాపై వస్తున్న ఆరోపణల విషయంలో  మీకు ఎలాంటి భయమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... ‘ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయపరమైనవే. వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉంది. షాపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని యూపీఏ హయాంలోనే సీబీఐ తేల్చిచెప్పింది. షా ఇక్కడికి వస్తున్నారంటేనే మా ప్రత్యర్థుల్లో గుబులు మొదలైంది. వాళ్ల తలరాతలను మార్చే ఎన్నికలు త్వరలో జరగనున్నాయ’ని చెప్పారు.

 సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు...
 ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేరు వినిపిస్తోందని, ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహాకూటమి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాషాయ కూటమిలో లేదు. అందుకు ఇంకా సమయముంది. సీట్ల కేటాయింపుపై కూడా అదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామ’న్నారు.

Advertisement
Advertisement