కుప్పకూలిన బ్రిడ్జి.. నదిలో మొసళ్లు! | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన బ్రిడ్జి.. నదిలో మొసళ్లు!

Published Fri, May 19 2017 4:07 PM

కుప్పకూలిన బ్రిడ్జి.. నదిలో మొసళ్లు! - Sakshi

దక్షిణ గోవాలోని ఒక బ్రిడ్జి కుప్పకూలడంతో ఆ సమయానికి దానిమీద ఉన్న దాదాపు 50 మంది నీళ్లలో పడిపోయారు. దక్షిణ గోవాలోని కర్‌చోరం ప్రాంతంలో సన్వోర్డెమ్ నదిపై పోర్చుగీసువారి పాలనలో నిర్మించిన పాదచారుల వంతెన ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కూలిపోయింది. ఈ నది జువారి నదికి ఉపనది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ వంతెనను మూసేశారు. కానీ పాదచారులు మాత్రం ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని రక్షించినా, చాలామంది అక్కడే గుమిగూడి చూస్తూ ఉండటంతో.. ఆ బరువును తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, నౌకాదళ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

ఇద్దరు మునిగిపోగా, 20 మంది వరకు సురక్షితంగా ఈదుకుంటూ బయటపడ్డారు. మరో 14 మందిని నౌకాదళ బృందాలు కాపాడాయి. అయితే.. సరిగ్గా బ్రిడ్జి కింద ఉన్న నదిలో మొసళ్లు ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించి రక్షణ చర్యల్లో ఉన్న సిబ్బందికి తెలిపారు. దాంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. మొసళ్లను గుర్తించేందుకు ప్రత్యేకమైన పెట్రోలింగ పడవలను రంగంలోకి దించారు. అలాగే మునిగిపోయినవారిని కాపాడేందుకు చేతక్ హెలికాప్టర్లు కూడా వచ్చాయని నౌకాదళ ప్రతినిధి ఒకరు చెప్పారు. కనీసం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని, నది పొడవునా ఆకాశ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. సాయంత్రం తర్వాత చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్లను నిలిపివేశారు.


Advertisement
Advertisement