దాసరిని ప్రశ్నించిన సీబీఐ | Sakshi
Sakshi News home page

దాసరిని ప్రశ్నించిన సీబీఐ

Published Tue, Apr 22 2014 4:06 AM

దాసరిని ప్రశ్నించిన  సీబీఐ - Sakshi

బొగ్గు క్షేత్రం కేటాయింపుల్లో అవకతవకలపై విచారణ  హిందాల్కోకు లబ్ధి చేకూర్చడంపై ప్రశ్నలు

 త్వరలో బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పరేఖ్‌కూ సమన్లు
 కుమార మంగళం బిర్లానూ ప్రశ్నించే అవకాశం

 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో ప్రమేయంపై బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావును సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి దాసరిని సమన్లు జారీ చేసి రప్పించిన అధికారులు... ఒడిశాలోని తాలబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపుల్లో అవకతవకలపై విచారించారు. 2005లో తాలబిరా-2 క్షేత్రాన్ని ప్రభుత్వరంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు కేటాయిస్తూ బొగ్గుశాఖలోని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నా అందుకు విరుద్ధంగా నైవేలీతోపాటు హిందాల్కోకు ఆ క్షేత్రాన్ని కేటాయించడంపై ఆయన్ను ప్రశ్నించారు. దాసరి 2004 నుంచి 2006 వరకూ తొలిసారి, 2006 నుంచి 2008 వరకూ రెండోసారి బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన 2000 సంవత్సరం నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సీబీఐ విచారణ అనంతరం ఆయన స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

బొగ్గుశాఖలో సంస్కరణలు బుట్టదాఖలు కావడానికి దాసరి, నాటి బొగ్గుశాఖ మంత్రి శిబూ సోరెన్ బాధ్యులంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ ఈ కుంభకోణంపై రాసిన పుస్తకంలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతోపాటు పరేఖ్‌ను నిందితులుగా పేర్కొంటూ గత ఏడాది కేసులు నమోదు చేసిన సీబీఐ ఈ వారంలో పరేఖ్‌ను విచారించే అవకాశం ఉంది. బిర్లా గ్రూప్‌లోని ఉన్నత స్థాయి అధికారులను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించినా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాకు సమన్ల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బొగ్గు కుంభకోణంలో ప్రత్యేకించి తాలబిరా-2 క్షేత్రం కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు టి.కె.ఎ. నాయర్ నుంచి లిఖితపూర్వక సమాధానాలు తీసుకున్నప్పటి నుంచి సీబీఐ ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశాక కేసు ముగింపు నివేదిక లేక చార్జిషీట్ దాఖలుపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు వివరించాయి.

 ఆధారాల్లేక రెండు కేసుల మూసివేత

 ఛత్తీస్‌గఢ్‌లోని బొగ్గు క్షేత్రాలను అడ్డదారిలో పొందారన్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ విజయ్ దర్దా, ఆయనకు చెందిన జేఎల్‌డీ యావత్మాల్ ఎనర్జీ లిమిటెడ్‌పై 2012లో నమోదు చేసిన కేసును సీబీఐ సరైన ఆధారాల్లేక మూసేసింది. అలాగే దర్దా కుటుంబానికి సన్నిహితుడైన నాగ్‌పూర్ వ్యాపారవేత్త మనోజ్ జయస్వాల్‌కు చెందిన జేఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లిమిటెడ్‌పై నమోదు చేసిన కేసులోనూ క్విడ్‌ప్రోకోను నిరూపించేందుకు ఆధారాల్లేక కేసును మూసేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసుల మూసివేత కోరుతూ నివేదిక సమర్పించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement