ఎన్నికల తర్వాత కూటములు సరికాదు | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత కూటములు సరికాదు

Published Thu, Sep 11 2014 12:47 AM

Delhi High Court reserves order on PIL challenging post-poll alliances

ఢిల్లీ హైకోర్టులో పిల్
 న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత రాజకీయపార్టీలు అధికారం దక్కించుకునేందుకోసం కూటమిగా ఏర్పడడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వు చేసింది. న్యాయవాది మిథిలేష్ కుమార్ పాండే ఈ పిల్‌ను దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల అనంతరం కూటమిగా ఏర్పడడం సరికాదని, ఇలా చేయడం ఓటేసే సమయంలో ఓటర్లను ఏమీ తెలియకుండా చీకట్లో ఉంచడమే అవుతుందని వాదించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. దీనిపై తగిన ఉత్తర్వులను వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల్లో ఒక రాజకీయపార్టీపై పోటీ పడిన మరో పార్టీ ఎన్నికల అనంతరం అదే పార్టీతో కూటమి ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా ప్రకటిస్తూ ఆదేశాలివ్వాలని పాండే తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అదేవిధంగా తమ ఎన్నికల మేనిఫెస్టోను తామే ఉల్లంఘిస్తూ రాజకీయపార్టీలు ఎన్నికల తరువాత అధికారం కోసం కూటమిగా ఏర్పాటవకుండా నిరోధించేలా, ఎన్నికల మేనిఫెస్టోను చట్టపరంగా ఆచరించే పత్రంగా చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) సంజయ్ జైన్ మాట్లాడుతూ.. దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ఏర్పాటుకోసం వివిధ పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడడం జరుగుతున్నదని వివరించారు. ఒకే పార్టీ పూర్తి మెజారిటీ సాధించే దాకా పదేపదే ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదన్నారు.

Advertisement
Advertisement