మసిని ‘మాయ’o చేశారు | Sakshi
Sakshi News home page

మసిని ‘మాయ’o చేశారు

Published Thu, Jul 7 2016 8:24 AM

మసిని ‘మాయ’o చేశారు

ఏడాదికేడాదీ కాలుష్యం పెరిగిపోతోంది. వాహనాలు, డీజిల్ జనరేటర్ల నుంచి వెలువడే  నల్లటి పొగలు రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. కానీ ఢిల్లీ ఐఐటీ కుర్రాళ్లు ఈ మసిని ‘మాయ’ం చేశారు. ప్రింటర్లలో ఇంకుగా.. గోడకేసే పెయింట్‌గా మార్చేశారు. వాహనాలు, డీజిల్ జనరేటర్ల నుంచి వెలువడే నల్లటి పొగను ఇంగ్లిష్‌లో సూత్ అని అంటారు.

ఇంధనం అరకొరగా మండటం సూత్ ఏర్పడటానికి కారణం. అయితే ఢిల్లీకి చెందిన కుశాగ్ర శ్రీవాస్తవ, అర్పిత్ ధూపర్, ప్రతీక్ సచన్, ఇషానీ జైన్‌లు ఈ మసినే ఇంకుగా, పెయింట్‌గా మార్చేందుకు ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. చక్ర పేరుతో ఓ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసిన వీరు అంతర్జాతీయ వేదికలపై అనేక అవార్డులు అందుకున్నారు. డీజిల్ జనరేటర్ల పొగ గొట్టాలకు నేరుగా తగిలించుకోగల ఈ పరికరం సూత్ మొత్తాన్ని పీల్చేసుకుని ద్రవరూపంలోకి మార్చేస్తుంది.

ఆ తరువాత కొద్దిపాటి శ్రమతో దాన్ని ఇంకు, పెయింట్‌లుగా మార్చుకోవచ్చు. ఇప్పటికే తాము ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా దాదాపు వంద డీజిల్ జనరేటర్లకు తగిలించి వాడుతున్నామని, పేటెంట్లు అందిన తరువాత వాణిజ్య స్థాయిలో వీటిని అందరికీ అందుబాటులోకి తెస్తామని కుశాగ్ర శ్రీవాస్తవ ‘సాక్షి’కి తెలిపారు. ఈ పరికరం బ్రీఫ్ కేసు సైజులో ఉంటుందని చెప్పారు. సూత్‌ను ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చేందుకు కొన్ని రసాయనాలను ఉపయోగించామని చెప్పారు. డీజిల్ జనరేటర్లతోపాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా అక్కడికక్కడే శుద్ధి చేసేందుకు కొత్త రకం పరికరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. అన్నీ సవ్యంగా సాగితే రెండు మూడు నెలల్లోనే ఈ వినూత్నమైన పరికరం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు.

Advertisement
Advertisement