మెట్రోలో సాంకేతిక లోపం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌! | Sakshi
Sakshi News home page

మెట్రోలో సాంకేతిక లోపం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

Published Tue, May 21 2019 4:34 PM

Delhi Metro Services Affected on Yellow Line Due to Technical Snag - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైలులో తలెత్తిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుర్గావ్‌-ఢిల్లీ మార్గమధ్యంలో సాంకేతికలోపం తలెత్తడంతో మెట్రో రైలు అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న సుమారు వెయ్యిమంది రోడ్లపైకి రావడంతో గురుద్రోణాచార్య, కుతుబ్‌మినార్‌ మెట్రోస్టేషన్‌ల మధ్య(జాతీయరహదారి 8పై) భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. దీంతో మెట్రో ప్రయాణీకులతో పాటు సాధారణ ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దృష్టికి రాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందజేయాలని రవాణశాఖ మంత్రిని ఆదేశించారు.

అంతేకాకుండా ఢిల్లీ మెట్రోనే పూర్తి బాధ్యతవహించాలన్నారు. సుల్తాన్‌పూర్‌ స్టేషన్‌లో ఓవర్‌హెడ్‌ వైర్‌లో సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, దీంతో ఎల్లోలైన్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు. తాత్కలికంగా హుడా సిటీ సెంటర్‌, సమయాపూర్‌బద్లీ, కుత్‌బ్‌మినార్‌ స్టేషన్ల మధ్య మెట్రో సేవలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడ్డ ప్రయాణీకులు ట్విటర్‌ వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కారు. ఇదే అదునుగా భావించిన క్యాబ్‌ డ్రైవర్లు మాత్రం చార్జీలు అమాంతం పెంచేసి ప్రయాణీకుల జేబుకు చిల్లు పెట్టారు. మరికొందరు పట్టాలపై నడుచుకుంటూ ఇతర స్టేషన్‌కు చేరుకున్నారు.

Advertisement
Advertisement