మెట్రోకు సౌర వెలుగులు | Sakshi
Sakshi News home page

మెట్రోకు సౌర వెలుగులు

Published Fri, Jul 4 2014 11:56 PM

మెట్రోకు సౌర వెలుగులు

- మూడు స్టేషన్లలో ప్లాంట్లు
- ప్రైవేటు సంస్థతో డీఎంఆర్సీ ఒప్పందం

న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వనరులు, పద్ధతులను ప్రోత్సహించడంతో భాగంగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మూడు స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించనుంది. స్టేషన్ల ఆవరణలోని భవనాలపై పైకప్పులపై వీటిని బిగిస్తారు. మొత్తం 250 కిలోవాట్ల పీక్ (కేడబ్ల్యూపీ) కరెంటును అందించగల ఈ ప్లాంట్లను ఆనంద్ విహార్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్‌బీటీ) మెట్రో స్టేషన్, ప్రగతి మైదాన్ స్టేషన్‌తోపాటు, డీఎంఆర్సీ పుష్పవిహార్ కార్యాలయంలో నిర్మిస్తారు.
 
ఆనంద్‌విహార్ ప్లాంటు 115 కేడబ్ల్యూపీ, ప్రగతిమైదాన్ 85 కేడబ్ల్యూపీ, పుష్ప్‌విహార్ ప్లాంటు కేడబ్ల్యూపీల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని డీఎంఆర్సీ అధికారవర్గాలు తెలిపాయి. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం డీఎంఆర్సీ.. తన ఎండీ మంగూసింగ్ సమక్షంలో నోయిడాకు చెందిన ప్రైవేటు సంస్థ జాక్సన్ ఇంజనీర్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) ఇందుకు సహకరించింది. ఇది వరకు ద్వారక సెక్టార్ 21 స్టేషన్‌లో నిర్మించినట్టుగానే, ఈ మూడు స్టేషన్లలో ‘ఆర్‌ఈఎస్‌సీఓ’ విధానంలోనే సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తారు.

ఈ విధానం లో ఉత్పత్తి అయిన కరెంటును డీఎంఆర్సీ యూనిట్ల చొప్పున కొంటుంది. ప్రైవేటు సంస్థే మూలధన పెట్టుబడిని సమకూర్చుకుంటుందని డీఎంఆర్సీ ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ అన్నారు. ఇలా సమకూరిన కరెంటును స్టేషన్ల విద్యుత్ దీపాలు, ఇతర నిర్వహణ అవసరాలకు వాడుతారు. ‘స్టేషన్లతోపాటు మెట్రోరైళ్ల డిపోలు, పార్కింగ్ కేంద్రాలు, నివాస సముదాయాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మేం ప్రయత్నిస్తాం. మూడోదశలో నిర్మిస్తున్న స్టేషన్లను సోలార్‌ప్లాంట్లతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని దయాళ్ వివరించారు. అంతేగాక మూడోదశ కోసం వినియోగించే అన్ని భవనాలనూ పర్యావరణానికి అనుకూల పద్ధతిలోనే నిర్మిస్తారు.
 
నగరంలో వాయుకాలుష్యం నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నందుకుగానూ డీఎంఆర్సీకి ఐక్యరాజ్యసంస్థ 2011 లో కార్బన్ క్రెడిట్లు ప్రదానం చేసింది. ఇదిలా ఉంటే గుర్గావ్ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫారంపైన కూడా సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా వరకు కరెంటు అవసరాలు తీరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘మేం ఇటీవలే 25 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటును నిర్మించాం. త్వరలో మొదటి ప్లాట్‌ఫారంపైనా కూడా ఇదే సామర్థ్యం గల మరో ప్లాంటు ను ఏర్పాటు చేస్తాం’ అని ఉత్తర రైల్వే అధికారి ఒకరు అన్నారు.

Advertisement
Advertisement