ట్రాఫిక్ నియంత్రణకు హెలీకాప్టర్‌లు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ నియంత్రణకు హెలీకాప్టర్‌లు

Published Wed, Nov 11 2015 2:30 PM

ట్రాఫిక్ నియంత్రణకు హెలీకాప్టర్‌లు

నేడు ప్రయోగాత్మకంగా పరిశీలన
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పడే తీవ్రమైన ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి పోలీసులు హెలీకాప్టర్‌ల సహాయం తీసుకోనున్నారు. దీపావళి సందర్భంగా మార్కెట్ ప్రాంతాలైన లజ్‌పత్‌నగర్, సరోజిని నగర్, కరోల్‌బాగ్, కొనాట్, చాందిని చౌక్, చౌరీ బజార్‌లలో మంగళవారం భారీ రద్దీ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి హెలికాప్టర్‌లు వినియోగిస్తున్నామని ప్రత్యేక పోలీసు కమిషనర్(ట్రాఫిక్) ముక్తేష్ చందర్ తెలిపారు. రెండు బృందాలు పవన్ హన్స్ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కు చేరవేయనున్నట్లు ఆ వివరాలను హెల్ప్‌లైన్ నంబర్‌తో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వివరించారు. పోలీసులు తమ పర్యవేక్షణను దక్షిణ ఢిల్లీలోని దౌలా కౌన్ నుంచి అతి తక్కువ ఎత్తులో నిర్వహిస్తారని చెప్పారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తొలిసారిగా గత అక్టోబర్‌లో దుర్గా నిమజ్జన సందర్భంగా హెలీకాప్టర్‌లను వినియోగించినట్లు గుర్తు చేశారు. ఈ పద్దతి ద్వారా ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ పరిస్థితులను విధుల్లో ఉన్న సిబ్బందికి తెలియజేయడం సులవవుతుందని చందర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement