ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది

Published Fri, Dec 11 2015 2:14 AM

ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది - Sakshi

పార్లమెంట్‌లో కాంగ్రెస్ రగడపై ప్రధాని మోదీ
 
 న్యూఢిల్లీ: వెర్రి ఊహలు, కల్పనలతో ప్రజాస్వామ్యం పనితీరు దెబ్బతింటుందని విపక్ష కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. కాంగ్రెస్  పేరును ప్రస్తావించకుండానే ఆ పార్టీపై విమర్శలు చేశారు. కేవలం ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటుకే ప్రజాస్వామ్యం పరిమితం కావొద్దన్నారు. ప్రజాస్వామ్యానికి రెండు ప్రమాదాలు ఉన్నాయని.. ఒకటి మన్‌తంత్ర ( ఒకరి వెర్రి ఊహలు, కల్పనలతో నిర్వహించడం), రెండోది ధన్‌తంత్ర (డబ్బుతో సాగించుకోవడం) అని పేర్కొన్నారు. నా ఇష్టం, నా మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నడవదని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రయోజనం కలిగించాల్సిన చట్టాలు పార్లమెంటులో జరుగుతున్న గందరగోళంలో చిక్కుకుంటుండడంతో.. ప్రజలు వారి హక్కులను పొందలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ఒక్క జీఎస్టీ బిల్లు అంశమే కాదు. ఆ బిల్లుపై అందరితో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరుపుతాం. మరి పేదలు, సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? బోనస్‌ల పెంపు బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రజలకు ప్రయోజనకరమైన ఎన్నో బిల్లులు పార్లమెంటు గందరగోళంలో చిక్కుకుపోతున్నాయి..’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు  మానుకొని ప్రజాస్వామ్యాన్ని పాటించాలన్నారు.

Advertisement
Advertisement