Sakshi News home page

హవాలా, ఉగ్రవాదంపై నోట్లదెబ్బ

Published Sun, Jan 8 2017 2:50 AM

హవాలా, ఉగ్రవాదంపై నోట్లదెబ్బ - Sakshi

సగం తగ్గిన హవాలా వ్యాపారం
కశ్మీర్‌లో 60% తగ్గిన ఉగ్ర హింస

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం హవాలా వ్యాపారాన్ని పెద్ద దెబ్బతీసిందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు ఆగిపోవడంతో హింస 60 శాతం తగ్గినట్లు అంచనా వేసింది. నోట్ల రద్దు తర్వాత చట్టవ్యతిరేక,  తీవ్రవాద కార్యకలాపాల్ని విశ్లేషించి నిఘా వర్గాలు ఈ నివేదిక విడుదల చేశాయి.. హవాలా మధ్యవర్తుల మధ్య ఫోను సంభాషణలు సగానికి సగం తగ్గాయని విశ్లేషణలో వెల్లడైంది. ఈ లెక్కల ప్రకారం హవాలా వ్యాపారం సగం తగ్గిందని అంచనా. కశ్మీర్‌లో అల్లర్లను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులకు కూడా నిధులు నిలిచిపోయాయి. ఉగ్రవాద సానుభూతిపరులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి.

ఉగ్రవాదులకు నిధుల అందించేందుకు రద్దైన నోట్లనే వాడేవారు. అలాగే పాకిస్తాన్‌లోని క్వెట్టా, కరాచీ ప్రింటింగ్‌ ప్రెస్‌ల్లో ముద్రించిన నకిలీ నోట్లు కూడా చలామణి చేసేవారు. నోట్ల రద్దు నిర్ణయంతో అవన్నీ చెల్లకుండా పోవడంతో నగదు లేక ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌లోని ఉగ్రవాదులు తక్షణ నగదు చెల్లింపులపైనే ఆధారపడ్డారు. నోట్ల రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధ హింస 60 శాతం తగ్గిందని నిఘా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా గత కొద్ది వారాలుగా పెరిగాయని విశ్లేషిస్తున్నారు.

మావోలకూ దెబ్బే..
మావోయిస్టులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్, జార్ఖండ్‌లో రద్దైన నోట్లను మార్చాలంటూ మావోయిస్టులు స్థానికుల్ని సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్‌ 9 అనంతరం మావోయిస్టులతో పాటు వారి మద్దతుదారుల నుంచి రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు నోట్ల రద్దు నిర్ణయం సాయపడిందని, ఈశాన్య భారతంలోని చొరబాటు గ్రూపులు కూడా భారీగా నష్టపోయాయనేది నివేదిక సారాంశం. 

Advertisement
Advertisement