సమాజ్‌వాదీలో మరో చిచ్చు | Sakshi
Sakshi News home page

సమాజ్‌వాదీలో మరో చిచ్చు

Published Tue, Sep 20 2016 1:59 AM

సమాజ్‌వాదీలో మరో చిచ్చు

అఖిలేశ్ సన్నిహితులైన ఎమ్మెల్సీల తొలగింపు
లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో  మరో వివాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన శివ్‌పాల్ యాదవ్.. సీఎం అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా ఏడుగురు యువ నేతలను సోమవారం పార్టీ నుంచి తొలగించారు. పార్టీ అధినేత ములాయంను విమర్శించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, క్రమశిక్షణ తప్పినందుకు ఎమ్మెల్సీలు సునీల్‌సజన్, ఆనంద్ బదౌరియా, సంజయ్‌లను పార్టీ నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపింది. వీరితో పాటు ఎస్పీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర చీఫ్ ఈబాద్, ఎస్పీ యువజన సభ రాష్ట్ర చీఫ్ బ్రిజేష్ యాదవ్, ఎస్పీ యూత్ బ్రిగేడ్ జాతీయ అధ్యక్షుడు గౌరవ్, ఛాత్ర సభ రాష్ట్ర అధ్యక్షుడు దిగ్విజయ్ దేవ్‌లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై తొలగించారు.

దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. కాగా తొలగింపు నిర్ణయం తర్వాత శివ్‌పాల్ .. అఖిలేశ్ ఇంటికెళ్లి చర్చించారు.  ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీలో సంస్కరణలు చేపడుతున్న శివ్‌పాల్.. భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ మేనల్లుడు ఎమ్మెల్సీ అరవింద్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే.

Advertisement
Advertisement