దౌలాకువా గ్యాంగ్‌రేప్ కేసు దోషులకు 20న శిక్ష ఖరారు

18 Oct, 2014 00:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దౌలాకువా గ్యాంగ్‌రేప్ కేసులో దోషులుగా గుర్తించిన ఐదుగురికి విధించే శిక్షను ద్వారకా న్యాయస్థానం సోమవారం ప్రకటించనుంది. దోషులకు విధించే శిక్షపై వాదోపవాదనలు శుక్రవారం పూర్తయ్యాయి. అత్యాచారానికి పాల్పడిన షంషద్ అలియాస్ ఖట్కూన్, ఉస్మాన్ అలియాస్ కాలే, సాహిద్ అలియాస్ చోటాబిల్లీ, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లీ, కమ్రుద్దీన్‌లను న్యాయస్థానం దోషులుగా ప్రకటించిన సంగతి విదితమే. వారికి ఖరారుచేసే శిక్షలపై శుక్రవారం న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి.
 
అసలేం జరిగిందంటే...
2010 నవంబర్ 24 నాటి రాత్రి కాల్ సెంటర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగినులు తాము నివసించే కాలనీ గేటు వద్ద వాహనం దిగి ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో ఓ వాహనంలో అక్కడికి వచ్చిన ఐదుగురు బాధితురాలిని అపహరించి మంగోల్‌పురి ప్రాంతానికి తీసుకెళ్లి అదే వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత వారు ఆమెను మంగోల్‌పురిలోని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. మరోవైపు సహోద్యోగిని కొందరు అపహరించుకునిపోయారని బాధితురాలి స్నేహితురాలు పోలీస్ కంట్రోల్‌రూంకు ఫోన్‌చేసింది. దీంతో అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి జాడను కనుగొని ఆస్పత్రికి తరలించారు.

సరిగ్గా ఏడురోజుల తర్వాత నిందితులందరినీ హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో అరెస్టు చేశారు. తాము అమాయకులమని, అన్యాయంగా తమను ఈ కేసులో ఇరికించారని నిందితులు కోర్టులో వాదించారు. కాగా పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో బాధితురాలు.. షంషద్, ఉస్మాన్‌లను గుర్తించింది. కమరుద్దీన్, షహీద్, ఇక్బాల్‌లు మాత్రం ఈ పరేడ్‌లో పాల్గొనడానికి నిరాకరించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తమ అభియోగపత్రంలో పేర్కొన్న సంగతి విదితమే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు