'ఊడిపోతాయనే లుంగీలను అనుమతించలేదు' | Sakshi
Sakshi News home page

'ఊడిపోతాయనే లుంగీలను అనుమతించలేదు'

Published Tue, Jul 15 2014 12:12 PM

'ఊడిపోతాయనే లుంగీలను అనుమతించలేదు'

లుంగీ కట్టుకు వచ్చారని ఏకంగా ఒక హైకోర్టు జడ్జినే అనుమతించకుండా బయటకు పంపేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్బు.. ఇప్పుడు తన డ్రెస్ కోడ్ను మరోసారి పరిశీలించుకోడానికి సిద్ధమైంది. పూర్తి ప్యాంటు, షర్టు లేదా కాలర్ ఉన్న టీషర్టు, లెదర్ బూట్లు ధరించిన వారికి మాత్రమే తమ క్లబ్బులోకి ప్రవేశం అంటూ చాలా కాలంగా ఈ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే.. ఈనెల 11వ తేదీన ఓ పుస్తకావిష్కరణకు వచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంధామన్ సంప్రదాయ పద్ధతిలో లుంగీ కట్టుకుని రాగా, ఆయనను వెక్కి పంపేశారు. 'స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ఈ వివక్ష కొనసాగడాన్ని నేను అంగీకరించలేను. వాళ్ల సభ్యులకైతే నిబంధనలు పెట్టుకోవచ్చు గానీ, ఆహ్వానం మీద వచ్చినవాళ్లకు కాదు' అని ఆయన మండిపడ్డారు.

దీనిపై తాజాగా క్లబ్బు యాజమాన్యం వివరణ ఇచ్చింది. న్యాయమూర్తిని అడ్డుకున్న సభ్యుడు తమకు క్షమాపణలు చెప్పారని, ముందుగా న్యాయమూర్తికి డ్రస్ కోడ్ గురించి చెప్పకపోవడం తప్పేనని తెలిపింది. అయితే.. మరో సీనియర్ సభ్యుడు మాత్రం అసలు విషయం చెప్పారు. తాగిన మత్తులో లుంగీ జారిపోతే బాగోదు కాబట్టే లుంగీలను నిషేధించామని, కానీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేమని ఆయన అన్నారు.

Advertisement
Advertisement