హ్యాకింగ్ విషయం దిగ్విజయ్‌కు ముందే తెలుసా? | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్ విషయం దిగ్విజయ్‌కు ముందే తెలుసా?

Published Thu, Dec 1 2016 2:17 PM

హ్యాకింగ్ విషయం దిగ్విజయ్‌కు ముందే తెలుసా? - Sakshi

కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవుతుందన్న విషయం ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు ముందే తెలిసినట్లుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'నగదురహిత సమాజం' కావాలంటున్నారని.. కానీ, అలాంటి లావాదేవీల్లో హ్యాకర్లు మోసాలు చేసే అవకాశం ఉందని ఆయన ఒకరోజు ముందే ట్వీట్ చేశారు. ఆ తర్వాత.. రాహుల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకయింది. గురువారం కాంగ్రెస్ పార్టీ అకౌంట్ కూడా హ్యాకర్ల బారిన పడింది. 
 
దీనిగురించి దిగ్విజయ్ మళ్లీ గురువారం కూడా పెద్దనోట్ల రద్దును విమర్శిస్తూ.. తమ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అవడాన్ని ప్రస్తావించారు. డిజిటల్, నగదురహిత భారతం సురక్షితం కాదనడానికి ఇదే నిదర్శనమన్నారు. దాదాపు 12 లక్షల మంది ఫాలోవర్లున్న రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంటును హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాంగ్రెస్‌కు ఒక షాక్ అయితే.. మర్నాడే పార్టీ అధికారిక అకౌంటును కూడా హ్యాక్ చేసి డబుల్ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. త్వరలోనే భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈమెయిళ్లను బయటపెడతామని, క్రిస్మస్ స్పెషల్ కోసం వేచిచూడాలని హెచ్చరించారు. ఎవరి అకౌంటు అయినా హ్యాక్ అయితే ఫిర్యాదు చేయడానికి కనీసం సైబర్ సెల్ లేకపోవడం ఎంత దారుణమని దిగ్విజయ్ అన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ ఒక సైబర్ సెల్ అయినా లేదా అని ఆయన ఆశ్చర్యపోయారు.
Advertisement
Advertisement