Sakshi News home page

‘ఆ ప్రయాణీకులు క్షేమం’

Published Fri, May 4 2018 7:21 PM

District Magistrate Denies Reports Of Deaths Says All Passengers Safe - Sakshi

సాక్షి, పట్నా : బిహార్‌లోని మొతిహరి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా మేజిస్ర్టేట్‌ వెల్లడించారు. గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 27 మంది మరణించినట్టు వచ్చిన వార్తలు వదంతులేనని మేజిస్ట్రేట్‌ రమణ్‌ కుమార్‌ చెప్పారు. ఢిల్లీకి వెళుతున్న ఈ బస్‌లో ప్రమాదం జరిగినప్పుడు కేవలం 13 మంది ప్రయాణీకులే బస్సులో ఉన్నారని చెప్పారు. వారంతా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని స్థానిక ఆస్పత్రిలో గాయాలకు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాలు ఎలాంటి మృతదేహాన్ని గుర్తించలేదని చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే గందరగోళం నెలకొనడంతో స్థానికులు భయాందోళనలకు లోనై మృతులపై వదంతులను నమ్మారని తెలిపారు. తొలుత ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని బిహార్‌ విపత్తుల నిర్వహణ మంత్రి దినేష్‌ చంద్ర యాదవ్‌ సైతం నిర్ధారించారు. బాధిత కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం సైతం ప్రకటించారు. స్ధానికులు తెలిపిన వివరాల మేరకే తాను 27 మంది చనిపోయారని ప్రకటించానని, తుది నివేదికనే పరిగణనలోకి తీసుకుంటామని కూడా చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నితీష్‌ కుమార్‌ సైతం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. బస్సు ముజఫర్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళుతుండగా మలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. మొతిహారి జిల్లా కొత్వా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారి 28పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement