ఈసీ వల్లే డీఎంకే ఓటమి | Sakshi
Sakshi News home page

ఈసీ వల్లే డీఎంకే ఓటమి

Published Mon, Jun 2 2014 11:44 PM

ఈసీ వల్లే డీఎంకే ఓటమి

చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో అన్నాడీఎంకే కుమ్మక్కైన కారణంగానే ఆ పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయని డీఎంకే అభిప్రాయపడింది. ఈసీ చేష్టలకు పోలీస్ అధికారులు వంతపాడారని సమావేశంలో ఆరోపణలు కుమ్మరించారు. డీఎంకే అధినేత కరుణానిధి జన్మదినం, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం ప్రధాన అజెండాలుగా సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో జరిగిన సమావేశానికి24 మంది పార్టీ ప్రముఖులు హాజరై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈసీ, పోలీస్ పక్షపాత ధోరణిపై సమావేశం మండిపడడం వంటి అంశాలపై చర్చ సాగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికార అన్నాడీఎంకే సహకరించుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇరువర్గాలు ఒక ఒప్పందం ప్రకారం నడుచుకున్నాయని అన్నారు. నిబంధనల పేరిట ఈసీ వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరమని సమావేశం అభిప్రాయపడింది.
 
 ముఖ్యంగా పోలింగ్‌కు ముందు రెండురోజుల పాటూ 144 సెక్షన్ విధించడం అధికార పార్టీ ప్రయోజనానికేనని వారు ఆరోపించారు. కొత్త ఓటర్ల చేర్పు నుంచిఒక పథకం ప్రకారం ఈసీ, అన్నాడీఎంకే ఎన్నికలను నడిపించారని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా ఈసీ, పోలీస్ ప్రేక్షక పాత్ర వహించిందని దుయ్యబట్టారు. అడపాదడపా ఈసీ మొసలి కన్నీరు కార్చడం మినహా మరేమీ చేయలేదని అన్నారు. తాజా ఎన్నికలు ఁజన నాయకం కాదు పన నాయకంరూ. (ప్రజాస్వామ్య పద్దతిలో ధనస్వామ్య పద్ధతిలో సాగాయి) అని వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ కొమ్ముకాసే విధానాన్ని నిర్మూలించేలా ప్రధాన ఎన్నికల కమిషన్‌ను సంస్కరించాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ సాగాలని కోరుతూ తీర్మానించారు.
 
 15లోగా నివేదిక- క్రమశిక్షణ చర్య
 ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కారణాలను విశ్లేషిస్తూ ఈనెల 15వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని పార్టీశ్రేణులను ఆదేశిస్తూ తీర్మానం చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పార్టీనేతల సహాయ నిరాకరణ, అధికారులు వ్యవహరించిన తీరు తదితర అంశాలపై సవివరంగా నివేదిక అందజేయాలని కోరారు. నివేదికలను పరిశీలించిన తరువాత పార్టీలో సంస్కరణలు, నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. అనధికార సమాచారం ప్రకారం 12 జిల్లాల్లో పార్టీ కమిటీలను మార్చనున్నట్లు తెలిసింది. 91 ఏళ్ల వయస్సులో 77 ఏళ్ల ప్రజాజీవితాన్ని పూర్తిచేసిన కరుణకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయక విరామం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినందుకు అభ్యర్థుల తరపున అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీకి ఓటేసిన 9,36,430 మంది ఓటర్లకు కృతజ్ఞతల తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement